సీఎం పళనిస్వామిపై సీబీఐ విచారణ | CBI to probe corruption charges against TN CM Palaniswami | Sakshi
Sakshi News home page

సీఎం పళనిస్వామిపై సీబీఐ విచారణ

Published Sat, Oct 13 2018 4:31 AM | Last Updated on Sat, Oct 13 2018 4:31 AM

CBI to probe corruption charges against TN CM Palaniswami - Sakshi

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి

చెన్నై: రోడ్డు కాంట్రాక్టు పనుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై సీబీఐ విచారణకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో చేపట్టిన రూ.3,500 కోట్ల విలువైన కాంట్రాక్టు పనులను ముఖ్యమంత్రి పళనిస్వామి తన బంధువులకు, బినామీలకు అప్పగించారని ఆరోపిస్తూ డీఎంకే నేత ఆర్‌ఎస్‌ భారతి గతంలో పిటిషన్‌ వేశారు. ఈ కేసులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌(డీవీఏసీ) అందజేసిన నివేదికను పరిశీలించిన జస్టిస్‌ ఏడీ జగదీశ్‌ చంద్ర శుక్రవారం ఈ ఆదేశాలిచ్చారు. దర్యాప్తునకు సంబంధించిన అన్ని పత్రాలను వారంలోగా సీబీఐకి అందజేయాలని డీవీఏసీని ఆదేశిస్తూ.. ప్రాథమిక విచారణ నివేదికను మూడు నెలల్లోగా అందజేయాలని సీబీఐని కోరారు.

రాష్ట్రంలో చేపట్టిన రోడ్డు కాంట్రాక్టు పనుల్లో అవకతవకలు జరిగాయనీ, వీటిపై డీవీఏసీ విచారణకు ఆదేశించాలని కోరుతూ డీఎంకే నేత భారతి జూన్‌లో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. స్పందించిన న్యాయస్థానం.. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని, రోజువారీ నివేదికను అందజేయాలని డీవీఏసీని సెప్టెంబర్‌ 12వ తేదీన ఆదేశించింది. అయితే, డీవీఏసీ దర్యాప్తు సీఎం పళనిస్వామికి అనుకూలంగా సాగుతోందని ఈనెల 9న జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్‌ భారతి అనుమానాలు వ్యక్తం చేయడంతో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement