సాక్షి, చెన్నై: దివంగత సీఎం, అమ్మ జయలలిత మరణం కేసులో చిన్నమ్మ శశికళకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం వ్యక్తిగతంగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆయన ఆర్ముగస్వామి కమిషన్ ఎదుట మంగళవారం తన వాదన చెప్పారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చోటు చేసుకు న్న పరిణామాల గురించి తెలిసిందే. తొలుత చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది పన్నీరు సెల్వమే.
అమ్మ మరణంలో మిస్టరీ ఉందని నినాదించారు. నిగ్గుతేల్చాలని పట్టుబట్టారు. చివరకు చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో సీఎంగా గద్దెనెక్కిన ఆమె ప్రతినిధి పళనిస్వామికి దగ్గరయ్యారు. అధికారాన్ని పంచుకు న్న ఈ ఇద్దరు అన్నాడీఎంకే నుంచి చిన్నమ్మను బహిష్కరించారు. అలాగే, అమ్మ మరణం మిస్టరీ నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్‌ను రంగంలోకి దించారు. ఈ కమిషన్ గతంలో 8 సార్లు సమన్లు జారీ చేసినా పట్టించుకోని పన్నీరు, తాజాగా పరుగులు తీయక తప్పలేదు.
గంటలపాటూ విచారణ
సోమవారం 3 గంటల పాటుగా ఆర్ముగ స్వామి కమిషన్ పన్నీరును విచారించింది. 78 ప్రశ్నలు సంధించగా, కొన్నింటికి సమాధానాలు ఇచ్చి, మిగిలిన వాటికి దాట వేశారు. ప్రధానంగా అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్, సీఎస్ రామ్మోహన్‌రావు కనుసన్నల్లోనే చికిత్స వ్యవహారాలు సాగినట్లుగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చడం చర్చకు దారి తీశాయి. మంగళవారం 6 గంటలు పా టు విచారణ జరిగింది. 120 ప్రశ్నల్ని పన్నీరు ముందు కమిషన్ వర్గాలు ఉంచగా, మరో 34 ప్రశ్నల్ని క్రాస్ ఎగ్జామిన్‌లో శశికళ తరపున న్యాయవాది రాజ చెందూ ర్ పాండియన్ సంధించారు. అలాగే, అపోలో ఆస్పత్రి తరపున 11 ప్రశ్నలు పన్నీరు ముందుంచారు.
చిన్నమ్మకు అనుకూలంగా..
గతంలో చిన్నమ్మకు వ్యతిరేకంగా స్వరాన్ని వినిపించిన పన్నీరు తాజాగా ఆమెను ఇరకాటంలో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. జయలలిత మరణం విషయంలో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అనుమానం లేదు అని పేర్కొనడం గమనార్హం. అయితే, ప్రజలు, కేడర్ అనుమానాలు వ్యక్తం చేశాయని, వారి ప్రతినిధిగా తాను కమిషన్ ఏర్పాటుకు పట్టుబట్టినట్టు పేర్కొనడం ఆలోచించాల్సిందే.
ఇక, జయలలితకు వ్యతిరేకంగా శశికళ, ఆమె కుటుంబీకులు ఎలాంటి కుట్రలు చేయలేదని స్పష్టం చేశారు. అలాగే, చిన్నమ్మ అంటే వ్యక్తిగతంగా తనకు మర్యాద, అభిమానం ఉందని క్రాస్ ఎగ్జామిన్ సమయంలో పన్నీరు ఇచ్చిన సమాధానాలు అన్నాడీఎంకేలో హాట్ టాపిక్ అయ్యాయి. కాగా జయలలితకు అందించిన వైద్య చికిత్సలు, సీసీ కెమెరాల తొలగింపు తదితర అంశాల గురించి తనకు తెలియదని పన్నీరు పేర్కొన్న దృష్ట్యా, ఆమెకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్, అపోలో యాజమాన్యాన్ని మరో మారు విచారించేందుకు కమిషన్ సిద్ధమైంది.
సంతృప్తికరంగా విచారణ
విచారణ అనంతరం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, విచారణ సంతృప్తికరంగా జరిగిందన్నారు. ‘వాస్తవాలు’ తెలియజేశానన్నారు. చిన్నమ్మ న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ మాట్లాడుతూ, కుట్రలు జరగలేదని, అనుమానం లేదన్న సమాధానాలను పన్నీరు వెల్లడించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment