సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మరణ మిస్టరీ అటు ఇటూ తిరిగి చివరకు అపోలోకు చుట్టుకుంది. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో అమ్మ గడిపిన 74 రోజుల సీసీటీవీ పుటేజీ దృశ్యాలపై విచారణ కమిషన్ పట్టుబట్టడం, అవి చెరిగిపోయాయని, అసలు రికార్డేకాకుండా ఒక అధికారి స్విచ్‌ఆఫ్ చేయమన్నాడని భిన్నమైన వాంగ్మూలాలు చోటుచేసుకోవడంతో అపోలో ఆసుపత్రిని సందర్శించేందుకు కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి సిద్ధమవుతున్నారు.
జ్వరం, డీహైడ్రేషన్...కేవలం ఈ రెండు వ్యాధులతో బాధపడుతూ అపోలోలో చేరారని 2016 సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. జయ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు, త్వరలో ఆరోగ్యం కుదుటపడుతుంది, డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు. అయితే బులెటిన్‌లో పేర్కొన్నదానికి భిన్నంగా అదే ఏడాది డిసెంబర్ 5న జయ కన్నుమూశారు. దీంతో అందరిలోనూ అనుమానాలు తలెత్తాయి. ప్రతిపక్షాలు సైతం సీబీఐ విచారణకు పట్టుబట్టాయి. అప్పట్లో అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన పన్నీర్‌సెల్వం సైతం విచారణకు పట్టుబట్టారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది. కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి ఎదుట సుమారు వందమందికి పైగా వాంగ్మూలం ఇచ్చారు. ఈ దశలో అపోలో ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల పుటేజీ కావాలని కమిషన్ ఇటీవల కోరినపుడు అవి చెరిగిపోయాయని బదులువచ్చింది. అయితే ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో టీటీవీదినకరన్ వర్గ ఎమ్మెల్యే వెట్రివేల్ జయ చికిత్స పొందుతున్న దృశ్యాలను బైటపెట్టాడు. అవి మార్ఫింగ్ దృశ్యాలను కొందరు కొట్టిపారేసినా స్వయంగా శశికళ చిత్రీకరించారని నమ్మబలికారు.
పుటేజీలపైనే పట్టుబట్టి ఉన్న కమిషన్ అపోలో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుబ్బయ్య విశ్వనాథన్, వైద్యులు పద్మావతి, భువనేశ్వరి, అరుళ్‌సెల్వన్, మాజీ ఎంపీ మనోజ్‌పాండియన్, శశికళ తరఫు న్యాయవాది సెంధూరపాండి వేర్వేరుగా మంగళవారం పిలిపించి విచారించింది. ఈ సందర్భంగా అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయని కమిషన్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా, చికిత్సలో భాగంగా వార్డు నుంచి జయను బైటకు తీసుకొచ్చినపుడు సీసీ టీవీ కెమెరాల స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా ఒక అధికారి ఆదేశించినట్లు విచారణ కమిషన్ ముందు అపోలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుబ్బయ్య విశ్వనాథన్ ఇచ్చిన వాంగ్మూలం కలకలానికి కారణమైంది. జయ చికిత్సకు సంబంధించిన బులెటిన్లు వేరేవారు సిద్ధం చేయగా, తాను సంతకం మాత్రమే చేశాను అని సీఓఓ చెప్పారు. అయితే ఆ బులెటిన్ తయారు చేసినవారు ఎవరని కమిషన్ ప్రశ్నించగా ఆయన వారంరోజుల గడువు కోరడంతో కమిషన్ మంజూరు చేసింది. జయ చేరిన 2016 సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు విడుదలైన బులెటిన్లలో పొంతనలేదు, వాటిని కూడా వివరించాలని కమిషన్ ఆదేశించింది.
సీసీటీవీ కెమెరాలు స్వీచ్‌ఆఫ్ చేయాలని ఒక అధికారి ఆదేశించినట్లుగా అపోలో సెక్యూరిటీ అధికారి తనతో అన్నాడని సుబ్బయ్య చెప్పడంతో సదరు అధికారి ఎవరని కమిషన్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సైతం తెలియదనే సమాధానమే వచ్చింది. సెక్యూరిటీ అధికారి ఇళంగోవన్ మృతిచెందడం వల్ల స్విచ్ ఆఫ్ చేయమని చెప్పిన అధికారిని గుర్తించేందుకు ఎవరిని అడగాలో తెలియడం లేదని కూడా ఆయన అన్నాడని కమిషన్ వర్గాలు చెప్పాయి. ఈ జవాబుకు ఆగ్రహించిన కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి ‘చనిపోయిన వారిని అడ్డుపెట్టుకుని వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా’ అని గద్ధించగా ఆయన మౌనం పాటించినట్లు తెలిసింది. 2016 సెప్టెంబర్ 22న పోయెస్‌గార్డెన్‌లో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు పుటేజీలను సేకరించాలని, అపోలో ఆసుపత్రిలో అదే నెల 23,24 తేదీల పుటేజీని పరిశీలించాలని, పోయెస్‌గార్డెన్ నుంచి అపోలో ఆసుపత్రి వరకున్న 17 సీసీటీవీ కెమెరాల పుటేజీని పరిశీలించాలని మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ మంగళవారం కమిషన్ ముందు హాజరై ఆర్ముగస్వామిని కోరాడు. కమిషన్ సైతం ఆయా పుటేజీలను సేకరించాలని నిర్ణయించుకుంది. పోయెÜగార్డెన్, అపోలో ఆసుపత్రిని సైతం పరిశీలించాలని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం.
మరోబాంబు పేల్చిన పన్నీర్: సీసీటీవీ పుటేజీల వివాదం ఇలా ఉండగా, డిప్యూటీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మరిన్ని అనుమానాలు రేకెత్తించే వ్యాఖ్యలతో బాంబుపేల్చారు. చెన్నై తమిళనాడు రాష్ట్రం తేనీలో మంగళవారం రాత్రి జరిగిన అన్నాడీఎంకే బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అపోలో ఆసుపత్రిలో జయను చూసేందుకు చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎంత ప్రయత్నించినా చూడలేక పోయాను. అమ్మ చికిత్స పొందిన 74 రోజులూ ఆసుపత్రి కిందకే పరిమితమైనా. రోజులు గడుస్తున్నా జయ ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో మెరుగైన చికిత్సకు అమెరికాకు పంపాలని నిర్ణయించుకున్నా. అమ్మకు ఏమైనా జరిగితే ప్రజల తమను రోడ్లపైకి రానీయరని భయపడ్డా. ఇదే విషయాన్ని తాను ప్రస్తావించి బతిమాలా. ‘మాపై నమ్మకం లేదా’ని అపోలో యాజమాన్యం నన్ను ఎదురుప్రశ్నించి నిరాకరించిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment