పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి తప్పించేందుకు పళనిస్వామి యత్నిస్తున్నారా? అవుననే సమాధానం అన్నాడీఎంకేలో వినిపిస్తోంది. ఇప్పటికే పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులపై బహిష్కరణ వేటు వేసిన పళనిస్వామి, ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదా నుంచి తొలగించే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం తన ఉనికి కాపాడుకునేందుకు తన మద్దతుదారులతో మూడోసారి అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై : ఐదేళ్లకు ఒకసారి జరగాల్సిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ‘చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లి’లా తయారైంది. జూన్ 23వ తేదీ, జూలై 11వ తేదీ సర్వసభ్య సమావేశం జరగ్గా, తన వర్గీయులతో మూడోసారి సర్వసభ్య సమావేశానికి పన్నీర్ సెల్వం సన్నాహాలు మొదలుపెట్టారు. అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న ఏక నాయకత్వం వివాదంపై ఎట్టకేలకూ ఎడపాడి పళనిస్వామి పైచేయి సాధించి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. పదవి చేపట్టడమే అదనుగా పన్నీర్ సెల్వం, ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరించారు.
పొన్నయ్యన్ ఆడియోపై నమ్మకం
ఇటీవల మాజీ మంత్రి పొన్నయన్ పేరున విడుదలైన ఆడియో కలకలం రేపింది. ఎడపాడి నెంబర్ గేమ్ ఆడుతున్నారని, ఆయనకు పార్టీ క్యాడర్‌లో పెద్ద బలం లేదంటూ వ్యాఖ్యానించడం ఆ పార్టీలో దుమారం రేపింది. దీనిపై అప్రమత్తమైన ఎడపాడి పార్టీలో కొత్త టీమ్‌ను నియమించి పొన్నయ్యన్‌ను ప్రాధాన్యత లేని పదవిలోకి నెట్టారు. పొన్నయ్యన్ మాటలను విశ్వసిస్తున్న పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించడంపై చర్చిస్తున్నారు. ఎడపాడి పళనిస్వామి నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నెలకొన్న ఉద్రిక్తత ఇంకా సద్దుమణగకముందే పన్నీర్‌సెల్వం మరోసారి సన్నద్ధం కావడం చర్చనీయాంశమైంది.
ఎడపాడి వైపు ఉన్నట్లుగా చెబుతున్న కార్యవర్గ సభ్యులకు గాలంవేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి తుది నిర్ణయాన్ని త్వరలో ఓపీఎస్ ప్రకటిస్తారని తెలుస్తోంది. పార్టీలోని ముఖ్యనేతలను పదవుల నుంచి ఎడపాడి తప్పించిన అంశాన్ని కూడా చర్చించాలని ఆలోచిస్తున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలో ఇప్పటికే రెండుసార్లు సర్వసభ్య సమావేశం జరుగగా, పన్నీర్ ప్రయత్నాలు ఫలిస్తే అది మూడో సర్వసభ్య సమావేశం అవుతుంది.
కుట్రలో భాగంగానే తాళం
అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులను సీఎం స్టాలిన్ అవకాశంగా తీసుకుని తమ పార్టీకి శాశ్వతంగా తాళం వేసేందుకు యత్నిస్తున్నారని ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఆరోపించారు. అన్నాడీఎంకేను భూస్తాపితం చేసేందుకు ద్రోహులతో స్టాలిన్ చేతులు కలిపారని, అందుకే తమ పార్టీ కార్యాలయానికి సీలు వేశారని విమర్శించారు. పన్నీర్‌సెల్వం సైతం అన్నాడీఎంకేను అణచివేయాలని కాచుకుని ఉన్నారని, అయితే ఆయన ఆశయం నెరవేరదని ఎడపాడి వ్యాఖ్యానించారు.
పోటాపోటీగా వినతిపత్రాలు
ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదాను సైతం పన్నీర్‌సెల్వం నుంచి లాక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ పదవిపై ఓపీఎస్, ఈపీఎస్ వేర్వేరుగా అసెంబ్లీ స్పీకర్‌కు వినతిపత్రాలు సమరి్పంచారు. ప్రధాన ప్రతిపక్ష ఉపనేత ఎంపికకై ఎమ్మెల్యేలతో ఈనెల 17వ తేదీ ఎడపాడి సమావేశం అవుతున్నారు. విధి విధానాలను అనుసరించి స్పీకర్ అప్పావుకు ఈ సమాచారం ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment