సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మరి కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు దివంగత అన్నాడీఎంకే నేత జయలలితకు సన్నిహితురాలైన శశికళ బుధవారం సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పార్టీ అధినేత్రి జయలలిత బంగారు పాలన కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తానన్నారు. అమ్మ అభిమానులంతా సహోదరుల్లా ఐకమత్యంతో పనిచేసి జయలలిత బంగారు పాలన కొనసాగేలా చూడాలని అభ్యర్థించారు.‘రాజకీయాలకు దూరంగా ఉంటాను. నా సోదరి, నేను దైవంగా పరిగణించే పురచ్చితలైవి (జయలలిత) బంగారు పాలన కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తాను’ అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 6న జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి శత్రువైన డీఎంకేను ఓడించాలని, డీఎంకే మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
అధినేత్రికి సన్నిహితురాలిగా..
జయలలిత నెచ్చెలిగా నీడలా వెన్నంటి ఉండి పార్టీ రాజకీయాల్లో శశికళ తనదైన ముద్రవేశారు. పార్టీపై పెత్తనం జయలలితదైనా శశికళకు చెప్పకుండా ఆమె ఏ నిర్ణయం తీసుకునేవారు కాదని ఆపార్టీ నేతలే చెబుతుంటారు. అందుకే అమ్మ మరణం తరువాత శశికళ చిన్నమ్మగా మారారు. ప్రధాన కార్యదర్శిగా మారి పార్టీని తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. నాటి సీఎం పన్నీర్‌సెల్వం చేత రాజీనామా చేయించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పు తెరపైకి రావడంతో పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి నాలుగేళ్ల శిక్ష అనుభవించి రెండు నెలల క్రితమే విడుదలయ్యారు.
రాజీకి అమిత్ షా ప్రయత్నాలు
అన్నాడీఎంకేలో కీచులాటలు డీఎంకేకు లాభదాయకమనే కారణంతో ఇరువర్గాలకు రాజీచేసేందుకు అమిత్‌షా ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు 60 సీట్లు కేటాయిస్తే అందులో 50 శాతం శశికళ వర్గానికి ఇస్తామని బీజేపీ బేరం పెట్టింది. అదే జరిగితే పార్టీ పగ్గాలు మెల్లమెల్లగా ఆమె చేతుల్లోకి వెళ్లడం ఖాయమని భావించిన అన్నాడీఎంకే అందుకు ససేమిరా అంది. అదే సమయంలో బీజేపీ ద్వారా పొందే సీట్లలో కమలం గుర్తుపై పోటీచేయాలన్న అమిత్‌షా షరతును దినకరన్ తోసిపుచ్చారు. అన్నాడీఎంకే అంత అయిష్టతను కనబరుస్తున్నపుడు ఆ కూటమి నుంచి పోటీకై బీజేపీ వద్ద సాగిలపడాల్సిన అవసరం లేదని దినకరన్‌ను శశికళ గట్టిగా మందలించారు. ఎడపాడి, శశికళ తీరుతో అన్నాడీఎంకే–బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన నెలకొంది.
డీఎంకే లాభపడకుండా..
శశికళ చేత బీజేపీనే రాజకీయ అస్త్రసన్యాసం చేయించినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నాడీఎంకేలో కుమ్ములాటలు డీఎంకేకు లాభించి అధికారంలోకి వస్తే తమకు నష్టమని బీజేపీ భావించింది. రాజకీయ క్రీడ నుంచి శశికళను డ్రాప్ చేయించడం ద్వారా అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చీలకుండా కాపాడుకోవచ్చని, డీఎంకే దూకుడుకు కళ్లెం వేయవచ్చని వ్యూహం పన్నింది. శశికళ నిర్ణయం తనకే ఆశ్చర్యం కలిగించిందని టీటీవీ దినకరన్ అన్నారు. రాజకీయాల నుంచి వైదొలగినంత మాత్రాన ఆమె వెనకడుగు వేసినట్లు భావించరాదని వ్యాఖ్యానించారు.
రాజకీయాలకు చిన్నమ్మ గుడ్‌బై.. కారణాలు ఇవే
Published Thu, Mar 4 2021 3:00 AM | Last Updated on Thu, Mar 4 2021 3:23 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment