
చెన్నై నుంచి శశికళకు ఉత్తరాలు!
అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళను తిడుతూ బెంగళూరు జైలుకు ఉత్తరాలు పోటెత్తున్నాయి.
బెంగళూరు: అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళను తిడుతూ బెంగళూరు జైలుకు ఉత్తరాలు పోటెత్తున్నాయి. జయలలిత మరణానికి కారణమైన శశికళ పతనమైపోతుందని శపిస్తూ పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారానికి 100కు పైగా ఉత్తరాలు వచ్చినట్టు జైలు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘శశికళ, సెంట్రల్ జైలు, పరప్పణ అగ్రహార, బెంగళూరు-560100’ చిరునామాతో తమిళంలో ఈ లేఖలు వచ్చినట్టు తెలిపాయి.
‘జయలలిత హత్యకు శశికళ కుట్ర చేశారు. జయ చనిపోవడానికి అనారోగ్యం కారణం కాదు. ప్రణాళిక ప్రకారమే ఆమెను హత్య చేశార’ని ఉత్తరాలు రాసినవారు ఆరోపించారు. ‘మాకెంతో ఇష్టమైన అమ్మను నువ్వు చంపావు. నీకు కృతజ్ఞత, విశ్వాసం లేదు. నువ్వు వెన్నుపోటుదారువి. నీకు జీవితాన్ని, అన్ని ఇచ్చిన వ్యక్తిని మోసం చేశావు. గుర్తుంచుకో నువ్వు చేసిన చెడ్డ పనులకు ఇంతకుఇంత అనుభవిస్తావు. క్షణం క్షణం నరకయాతన అనుభవిస్తావ’ని ఉత్తరాల్లో శశికళను శపించారు.
ఈ ఉత్తరాలను ఇళవరసి చదివేశారని, అభ్యంతకరంగా ఉన్న వాటిని చించేసేవారని అధికారవర్గాలు తెలిపాయి. మొదట్లో శశికళ కూడా ఉత్తరాలు చదివేవారని, తర్వాత వాటిని చూడడం మానేశారని వెల్లడించాయి. తమిళనాడులోని సేలం, ధర్మపురి, మదురై, తిరుచ్చిరాపల్లి, దిందిగల్, కరూర్ ప్రాంతాల నుంచి ఉత్తరాలు వచ్చినట్టు పేర్కొన్నాయి. చెన్నై నుంచి కూడా కొన్ని లేఖలు వచ్చినట్టు తెలిపాయి.