చెన్నె: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళకు మరో భారీ షాక్ తగిలింది. ఆమెకు సంబంధించిన వంద కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను విభాగం జప్తు చేసింది. బినామీ లావాదేవీల చట్టం కింద బుధవారం ఆమెకు సంబంధించిన 11 ఆస్తిపాస్తులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నె శివారులోని పయ్యనూర్‌లో ఉన్న ఆస్తులను ఐటీ విభాగం సొంతం చేసుకుంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1991-1996 మధ్య 24 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు ఐటీ విభాగం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ అప్పట్లో రూ.20 లక్షలు ఉండగా ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.100 కోట్లకు చేరింది.
ఆస్తిపాస్తుల జప్తు ఇలా..
- చెన్నెలో శశికళకు సంబంధించిన 65 ఆస్తులను గతేడాది ఐటీ అటాచ్ చేసింది.
- 2019లో రూ.1,600 కోట్ల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2017లో 187 ఆస్తులపై తనిఖీలు జరిగాయి. రూ.1,430 కోట్ల పన్ను చెల్లించలేదని శశికళపై అభియోగాలు ఉన్నాయి.
- 1991 జూలై నుంచి ఏప్రిల్ 1996 వరకు శశికళ బంధువు ఇళవరసి, వీఎన్ సుధాకరన్ పేర్ల భారీగా ఆస్తుల కొనుగోళ్లు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
66 ఏళ్ల శశికళ 2017 ఫిబ్రవరిలో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలు నుంచి శశికళ విడుదలవడంతో తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్రమాస్తుల కేసులో ఇంకా ఆమెపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని అందరూ ఊహించగా అనూహ్యంగా ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆమె మళ్లీ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది.
చదవండి: Tamil Nadu: మా వల్ల కాదు బాబోయ్.. 15వ తేదీలోపు ఎన్నికలు అసాధ్యం!
Comments
Please login to add a commentAdd a comment