సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల నుంచి అస్త్రసన్యాసం చేసిన శశికళ ఆధ్యాత్మిక జీవనం వైపు మొగ్గుచూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్యటన చేయాల్సిన ఆమె ఆధ్యాత్మిక పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు శిక్ష ముగించుకుని జనవరి 27న జైలు నుంచి విడుదలైన శశికళ గతంలో నిర్ణయించుకున్న ప్రకారం క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి ఉంది.
చేజారిపోయిన అన్నాడీఎంకేను తన చేతుల్లోకి తీసుకోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి అధికారంలోకి రావడం ఆమె లక్ష్యాలుగా ఉండేవి. అయితే అన్నాడీఎంకే–బీజేపీ మధ్య జరిగిన సీట్ల సర్దుబాటు చర్చల్లో శశికళ ప్రస్తావన బెడిసికొట్టడంతో పరిస్థితి మారిపోయింది. బీజేపీలోని ఒక కీలకవ్యక్తి, కుటుంబసభ్యుని సూచనల మేరకు రాజకీయాల నుంచి ఆమె తాత్కాలికంగా వైదొలిగారు. ఈనెల 11వ తేదీ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చెన్నై టీనగర్‌లోని అగస్తీశ్వరాలయంలో పూజలు జరపనున్నారు. 15వ తేదీ నుంచి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకు దిగుతారు.
Comments
Please login to add a commentAdd a comment