సాక్షి ప్రతినిధి, చెన్నై/బెంగళూరు: జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఆమెను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి ఐసీయూకి మార్చారు. ‘‘ప్రస్తుతం ఆమెకు కోవిడ్ 19 సోకింది. ఇతర ఏ అనారోగ్యాలు లేవు. ఆమె ఆక్సిజన్ స్థాయిలు 98 శాతంగా ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కనిపిస్తోంది’’అని ఆస్పత్రి సూపరిండెంట్ రమేశ్ కృష్ణ చెప్పారు. ఆమెను మరో వారం పదిరోజుల అనంతరమే డిశ్చార్జ్ చేయవచ్చన్నారు.
అంతకుముందు మంగళవారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గుతో బాధపడుతున్న శశికళను బుధవారం ఉదయం పరప్పన అగ్రహార జైలు అధికారులు బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 27న శశికళ జైలు నుంచి విడుదల కావాల్సిఉంది. శశికళ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, కర్ణాటక ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కుట్ర జరుగుతోందని అన్నా ద్రవిడర్ కళగం ప్రధాన కార్యదర్శి, ఆమె సోదరుడు దివాకరన్ ఆరోపించారు. తమిళనాడు మన్నార్‌కుడిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈమేరకు కర్ణాటక రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment