victoria hospital
-
శశికళకు కరోనా
సాక్షి ప్రతినిధి, చెన్నై/బెంగళూరు: జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఆమెను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి ఐసీయూకి మార్చారు. ‘‘ప్రస్తుతం ఆమెకు కోవిడ్ 19 సోకింది. ఇతర ఏ అనారోగ్యాలు లేవు. ఆమె ఆక్సిజన్ స్థాయిలు 98 శాతంగా ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది’’అని ఆస్పత్రి సూపరిండెంట్ రమేశ్ కృష్ణ చెప్పారు. ఆమెను మరో వారం పదిరోజుల అనంతరమే డిశ్చార్జ్ చేయవచ్చన్నారు. అంతకుముందు మంగళవారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గుతో బాధపడుతున్న శశికళను బుధవారం ఉదయం పరప్పన అగ్రహార జైలు అధికారులు బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 27న శశికళ జైలు నుంచి విడుదల కావాల్సిఉంది. శశికళ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, కర్ణాటక ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కుట్ర జరుగుతోందని అన్నా ద్రవిడర్ కళగం ప్రధాన కార్యదర్శి, ఆమె సోదరుడు దివాకరన్ ఆరోపించారు. తమిళనాడు మన్నార్‌కుడిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈమేరకు కర్ణాటక రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. -
విక్టోరియా భవంతి.. ఆసక్తికర విషయాలు
కళలకు, అపురూపమైన శిల్ప సంపదకు అనంతపురం జిల్లా ప్రసిద్ధి చెందింది. జిల్లాలో అలనాటి ఎన్నో అపురూప కట్టడాలు నేటికీ చెక్కుచెదరకుండా నిలిచాయి. నాటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా అలరారుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే 75 నుంచి 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పురాతన కట్టడాల పరిరక్షణకు పురావస్తు శాఖ సిద్ధమైంది. ఇందులో జిల్లా కేంద్రంలోని పాతూరు సీడీ ఆస్పత్రి ఒకటి. తొలి ప్రసూతి కేంద్రంగా ఖ్యాతి గడించిన ఈ ఆస్పత్రిని అప్పట్లో ‘క్వీన్ విక్టోరియా ఆస్పత్రి’గా పిలిచేవారు. చరిత్రకు సాక్షీభూతమై నిలుస్తూ నేటికీ అదే రాజసాన్ని ఒలకబొస్తున్న ‘ది క్వీన్ విక్టోరియా’ పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, అనంతపురం: అనంత జిల్లా ఏర్పాటు వెనుక సుదీర్ఘ చరిత్రనే ఉంది. అశోకుడి మొదలు.. నొలంబులు, గంగరాజులు, చోళులు, హోయసలలు, యాదవులు, రాయలు, మొఘలలు, నిజాముల వరకూ అందరి పాలనను చవిచూసిన ఈ ప్రాంతాన్ని 1800వ సంవత్సరంలో సైనిక సహకార పద్ధతి కారణంగా బ్రిటీష్ వారికి నిజాం నవాబు అప్పగించారు. అలా బళ్లారి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఈ ప్రాంతంలోని గుంతకల్లు, గుత్తి ప్రాంతాల్లో తొలుత బ్రిటీష్ వారు కాలు పెట్టారు. తర్వాత 1882లో అనంతపురం జిల్లాను ఏర్పాటు చేశారు. వారి హయాంలో నిర్మించిన అపురూప కట్టడాలు ఎన్నో ఈ జిల్లాలో నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయ. అందులో ఒకటి విక్టోరియా ఆస్పత్రి. నేటి తరానికి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ ఆస్పత్రి నిర్మాణంలో దాగి ఉన్నాయి. జిల్లా కేంద్రంగా ఏర్పాటైన అనంతపురంలో 1901 నాటి వరకు పట్టణ జనాభా కేవలం 8వేలు మాత్రమే ఉండేది. పేరుకు జిల్లా కేంద్రమైనా.. గర్భిణులకు సరైన వైద్య చికిత్సలు అందేవి కావు. పురుడు పోసుకోవాలంటే సరైన ఆస్పత్రులు లేవు. చాలా మంది ఇంటి వద్దనే మంత్రసాని సాయంతో పురుడు పోసుకునేవారు. దీంతో అప్పటి బ్రిటీష్ అధికారి మెక్లాడ్... అనంతపురంలోని చెరువు కట్టకు సమీపంలో ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1903లో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఆ రోజుల్లో లేడీ హాస్పిటల్‌గా పిలిచే ఈ భవంతిని అప్పటి గవర్నర్ ఆఫ్ మద్రాస్‌గా ఉన్న హామ్టిల్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికీ లండన్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. ఎంతో పటిష్టంగా నిర్మించిన ఈ విశాల భవంతి తొలిరోజుల్లో విక్టోరియా జనరల్ హాస్పిటల్‌గా, 1903లో మెటర్నటీ హాస్పిటల్‌గా, 1913లో కోషా హాస్పిటల్‌గా రూపాంతరం చెందుతూ వచ్చింది. ప్రస్తుతం సీడీ హాస్పిటల్ (ప్రస్తుతం తాడిపత్రి బస్టాండు సమీపంలో)గా ఖ్యాతి గడించింది. ఆయూష్ విభాగానికి కేటాయించిన గదులు, నూటా ఇరవై ఏళ్లు దాటిన చెక్కుచెదరని ఆస్పత్రి పాలక భవనం 1961లో ప్రస్తుతమున్న ప్రభుత్వ సర్వజనాసుపత్రి నిర్మాణం జరిగే వరకూ క్వీన్ విక్టోరియా ఆస్పత్రినే ప్రధాన ఆస్పత్రిగా ఉండేది. తర్వాతి రోజుల్లో దీనిని టీబీ హాస్పిటల్‌గా మార్చారు. ప్రస్తుతం ఇక్కడ జనరల్ ఓపీతో పాటు హోమియో, ఆయూష్ వైద్య సేవలనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొంత కాలం కోవిడ్ కేర్సెంటర్గానూ సేవలందించారు. ప్రతి రోజూ వంద మంది ఓపీతో రద్దీగా ఉండే ఈ చారిత్రక కట్టడంలో కొంత భాగంలో త్వరలో 60 పడకలతో భారీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ప్రధాన పరిపాలన భవంతితో పాటు మిగిలిన పురాతన కట్టడాలకు తన సొంత ఖర్చుతో పూర్వ వైభవాన్ని తీసుకువస్తామంటూ ప్రభుత్వాన్ని చరిత్ర పరిశోధకుడు ఏజీ అనిల్‌కుమార్‌రెడ్డి అభ్యర్థించారు. దీంతో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి పాత కట్టడాల పరిరక్షణకు సిద్దమైంది. వాసరత్వ సంపదగా 75 నుంచి వందేళ్లు దాటిన చరిత్రాత్మక కట్టడాలు ఎక్కడున్నా అవి పురావస్తు శాఖ పరిధిలోకి వస్తాయి. ఇందులోనూ కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు వేర్వేరుగా పర్యవేక్షిస్తుంటాయి. ఇందులో భాగంగా ఇంటాక్ (భారతీయ వాసరత్వ పరిరక్షణ సంస్థ) ఎంపిక చేసిన కట్టడాల పరిరక్షణకు పురావస్తుశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ప్రభుత్వ శాఖల సమన్వయలోపం కారణంగా రెండేళ్ల క్రితం (గత టీడీనీ ప్రభుత్వ హయాంలో) నగరంలోని ఎంతో చరిత్ర కల్గిన బ్రిటీష్ కాలం నాటి తాలూకా ఆఫీసును ఎన్ఓసీ తీసుకోకుండానే కూల్చేశారు. అప్పటి నుంచి అధికారులు మరింత అప్రమత్తమై ప్రాచీనకట్టడాల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. తొలి ఎంపీ వారసుల దాతృత్వం.. 1951లో తొలి ఎంపీ (రాజ్యసభ) రహంతుల్లాతో పాటు ఆయన సోదరులు ఖాన్ సాహెబ్ అమాముద్దీన్, అమీరుద్దీన్, ముస్తాఫా సంయుక్తంగా పది ఎకరాల భూమితో పాటు ప్రసూతి కేంద్రం అభివృద్ధికి అవసరమైన రూ.1,250 నగదును విరాళంగా అందజేశారు. ఈ హాస్పిటల్ ఎదురుగా కమ్మూరు గ్రామానికి వెళ్లే చెరువు తూముండేది. ఈ తూము పరిధిలో రహంతుల్లా వారసులకు వందల ఎకరాల భూములు ఉండేవి. అందులో కొంత బ్రిటీష్ వారి కోరిక మేరకు విరాళంగా అందజేసినట్లు ఇప్పటికీ అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో కనిపిస్తోంది. విక్టోరియా భవంతిని కాపాడుకుంటాం ప్రాచీన కట్టడాలు, శిల్ప సంపద, శాసనాల పరిరక్షణ బాధ్యత సాధారణంగా పురావస్తుశాఖ, టూరిజం, దేవదాయశాఖ పరిధిలో ఉంటాయి. వారసత్వ ప్రాధాన్యత కల్గిన పురాతన కట్టడాల పరిరక్షణ బాధ్యత ఎక్కడున్నా మేమే తీసుకుంటాం. ఇందులో ప్రభుత్వ శాఖల సహకారం చాలా అవసరం. జిల్లాలోని విక్టోరియా హాస్పిటల్‌కు ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. త్వరలో అధికారికంగా ఈ కట్టడాన్ని మా పరిధిలోకి తెచ్చుకుంటాం. – రజిత, సహాయ సంచాలకులు, పురావస్తుశాఖ -
పీపీఈ కిట్లతో డ్యాన్స్ చేశారు
బెంగళూరు: దేశంలో కరోనా వ్యాప్తి బయటపడిన నాటి నుంచి పోలీసులు, వైద్యులు ఇళ్లకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. రోజుల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో కుంగుబాటుకు గురవుతున్నారు. ఈ క్రమంలో తమను తాము ఉత్సాహపర్చుకోవడం కోసం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి వైద్యులు ఓ నూతన మార్గాన్ని కనుగొన్నారు. పాత పాటలకు డ్యాన్స్ చేయడం, సహోద్యోగుల కోసం వంట చేయడం, మహిళలకు మెహందీ పోటీలు, పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తూ తమను తాము ఉత్సాహపర్చుకోవడమే కాక మిగతవారికి సంతోషాన్ని కల్గిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీపీఈ కిట్లు ధరించిన వైద్యులు ముగ్గురు.. 1960 నాటి హిందీ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో వైద్యులు ‘లిఖే జో ఖాత్ తుజే’ పాటకు డ్యాన్స్ చేశారు. వీరంతా గత వారం రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అస్మా బాను మాట్లాడుతూ... ‘ప్రస్తుతం ఆసుపత్రిలో కరోనా వైరస్ సోకిన వారిలో 18 మంది పిల్లలు ఉన్నారు. వారిలో ధైర్యం నింపడం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళల కోసం మెహందీ.. పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నాము. విజేతలకు బహుమతులు కూడా ఇస్తాము. పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు, క్యారమ్ బోర్డులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక నేను డాక్టర్ బాలాజీ పైతో కలిసి మాకు కేటాయించిన గదిలో ఆహారాన్ని వండి ఇతర సిబ్బంది అందజేస్తున్నాం’ అని తెలిపారు -
బెంగుళూరులో కరోనా బాధితుడి ఆత్మహత్య
బెంగళూరు : కర్ణాటకలో ఒక కరోనా బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిలక్‌నగర్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి శ్వాసకోస సంబంధ వ్యాది, హై ఫీవర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 24న బెంగుళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేరాడు. ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతన్ని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో పాటు ఆ వ్యక్తి కాలేయం, మూత్ర పిండాల సమస్యతో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతుండడంతో క్రమం తప్పకుండా డయాలసిస్ కూడా నిర్వహిస్తున్నారు. (బ్రిటన్ చిన్నారుల్లో కొత్త లక్షణాలు) ఈ క్రమంలోనే సోమవారం ఉదయం డాక్టర్లు ఐసీయులో పేషెంట్లను చూస్తుండడంతో ఇదే సరైన సమయమని భావించిన బాధితుడు తనకు కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డుకు టిఫిన్ తెమ్మని చెప్పాడు. అతను వెళ్లగానే అత్యవసర మార్గం ఉపయోగించి భవనం ఆరో అంతస్తుకు చేరుకొని అక్కడి నుంచి కిందకు దూకాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉండడంతో నిబంధనల ప్రకారం మృతదేహాన్ని బంధువులకు అప్పగించకుండా దహన సంస్కారాలు నిర్వహించారు. చనిపోయిన వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, కొన్ని వారాల క్రితం దుబాయ్ నుంచి తిరిగివచ్చినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. ('సిక్స్ కొడితే ఆ బంతిని బ్యాట్స్‌మన్ తెచ్చుకోవాలి') -
మంటల్లో మహిళ
వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, కామాంధుల వేధింపులు, అనారోగ్యం.. ఇలా ఎన్నో సమస్యలు మహిళలను సజీవ దహనానికి పురికొల్పుతున్నాయి. పోలీసులు, మహిళా శిశుసంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ కేంద్రాలు ఎలాంటి భరోసా నింపలేకపోతున్నాయి. కాలిన గాయాల బాధితుల్లో పురుషలు కంటే మహిళలే అధికంగా ఉండడం సమాజంలో వారి భద్రత ఎంత దీనంగా ఉందో చెబుతోంది. సాక్షి, బెంగళూరు: ప్రమాదవశాత్తూ శరీరం కాలిపోయిన రోగుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలోని విక్టోరియా ఆస్పత్రిలో కాలిన వారికి చికిత్స చేసేందుకు ప్రత్యేక వార్డు కేటాయించారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్ల నివేదికలు చేదు వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలు కోల్పోయిన వారిలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. చాలామంది కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన తర్వాత మృత్యువుతో పోరాడి ఓడిపోతున్నారు. ఆత్మహత్యాయత్నాలే అధికం సరైన వైద్యం అందకపోవడంతోనే మృత్యువాత పడుతున్నారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే కాలిన శరీరాలతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలు కోల్పోతున్న వారిలో ప్రమాదవశాత్తూ కాలిన వారి కంటే ఆత్మహత్యాయత్నం చేసి గాయపడినవారే అధికమని నివేదికలు పేర్కొంటున్నాయి. కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్న కేసులే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక వార్డులో చికిత్స నగరంలో సెయింట్ జాన్స్ ఆస్పత్రి కాకుండా విక్టోరియా ఆస్పత్రిలో కాలిన గాయాలకు చికిత్స చేసే నిమిత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. నగరంలో సుమారు 40 శాతం కాలిన కేసులు విక్టోరియాలో చికిత్స తీసుకున్నట్లు ఆస్పత్రి రికార్డుల ద్వారా తెలుస్తోంది. గణాంకాలతో పోల్చితే ప్రతి ఏటా మహిళల సంఖ్య కంటే పురుషులు తక్కువగానే ఉన్నారు. అయితే 2018లో మాత్రం మహిళలు 347 ఉండగా.. పురుషులు 477 మంది ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అంతేకాకుండా ప్రతి ఏటా బాధితుల సంఖ్య కూడా తగ్గుతుండటం శుభసూచకం. కుటుంబ సమస్యలదే పాపం కాలిన గాయాలతో విక్టోరియా ఆస్పత్రిలో చేరుతున్న వారిలో ఎక్కువ మంది ఆత్మహత్యకు పాల్పడిన వారే ఉండటం విశేషం. అందులోనూ కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్న వారే అధికం. అంతేకాకుండా చాలా మంది కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భర్త తల్లిదండ్రులు, ఆడపడుచులతో విభేదాలే ఆత్మహత్యాయత్నాలకు కారణమని మహిళ తరఫు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆస్పత్రుల బాట పడుతున్న వారు విక్టోరియా ఆస్పత్రికే ఎక్కువ మంది వస్తున్నారు. కాగా రెండోస్థానంలో సెయింట్జాన్ ఆస్పత్రి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
కరీం తెల్గీ మృతి
-
కరీం తెల్గీ మృతి
సాక్షి, బెంగళూరు: సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీ(56) గురువారం మృతిచెందాడు. మెనింజైటిస్, బహుళ అవయవ వైఫల్యంతో వారం రోజులుగా తెల్గీ బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, గురువారం గుండెపోటు రావడంతో పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు చెప్పారు. జైలులో ప్రత్యేక మర్యాదలు పొందిన వారిలో తెల్గీ ఉన్నారని అప్పటి కర్ణాటక డీఐజీ ఆరోపించడంతో ఆయన మళ్లీ వార్తల్లోకెక్కారు. నకిలీ స్టాంప్ పేపర్ల కేసులో తెల్గీ 2001లో అజ్మీర్‌లో అరెస్టయ్యాడు. 2006లో కోర్టు ఆయనకి 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.202 కోట్ల జరిమానా విధించింది. గత 16 ఏళ్లుగా బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో ఉన్న సమయంలో తెల్గీకి హెచ్ఐవీ సిరంజి ఎక్కించారని ఆయన తరఫు లాయర్ గతంలో కోర్టుకు చెప్పారు. నాయకులు, సెక్యూరిటీ ప్రెస్ అండతోనే.. 1994లో స్టాంప్ పేపర్ లైసెన్స్ సంపాదించిన తెల్గీ ముంబై మింట్ రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. రెవెన్యూ శాఖ, స్టాంప్ కార్యాలయం, నాసిక్ సెక్యూరిటీ ప్రెస్‌లోని అధికారులతో స్నేహం పెంచుకున్నాడు. తనకున్న రాజకీయ సాన్నిహిత్యంతో నాసిక్ ప్రెస్‌లో యంత్రాల్ని పనికిరానివిగా ప్రకటించేలా చేసి వాటిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిని కొని ముంబైలోని తన కార్యాలయంలో స్టాంపు పేపర్ల ముద్రణను ప్రారంభించాడు. నాసిక్ ప్రెస్ భద్రతా అధికారుల సాయంతో స్టాంపుల ముద్రణ రంగుల్ని సంపాదించాడు. 350 మంది ఏజెంట్ల సాయంతో భారీ స్థాయిలో నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని కొనసాగించాడు. వారు బ్యాంకులు, బీమా కంపెనీలు, స్టాక్ బోక్రరేజ్ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలకు పెద్ద మొత్తంలో నకిలీ స్టాంపుల్ని విక్రయించేవారు. అధికారంలో ఉన్న నేతలు, పోలీసు అధికారుల సహకారంతో తెల్గీ ఈ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. నార్కో పరీక్షల్లో అనేకమంది ప్రముఖుల పేర్లను వెల్లడించాడు. మలుపు తిప్పిన జైలు జీవితం సాధారణ రైల్వే ఉద్యోగి కుమారుడైన అతను 2001లో అరెస్టయ్యే వరకూ రాజకీయ నాయకులు, పోలీసుల సాయంతో అనేక రాష్ట్రాల్లో అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. నకిలీ తెల్గీ అక్రమాల విలువ దాదాపు రూ.20వేల కోట్లు. దేశ ఆర్థిక మార్కెట్లను కుదిపేసిన ఈ అక్రమాల తీవ్రత దాదాపు రూ.33వేలకోట్లు. కర్ణాటకలోని బెలగావి జిల్లా ఖానాపూర్‌కు చెందిన తెల్గీ చిన్నతనంలో రైళ్లలో కూరగాయలు, పళ్లు అమ్మేవాడు. బెలగావి కాలేజీ నుంచి బీకాం డిగ్రీ సంపాదించాక సౌదీకి వెళ్లాడు. అక్కడ దాదాపు ఏడేళ్లు గడిపి తిరిగి ముంబైకి చేరాక అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు. యువకులను దుబాయ్ పంపిస్తానని మోసగించిన కేసులో ముంబై పోలీసులు 1991లో తెల్గీని అరెస్ట్ చేశారు. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. నకిలీ షేర్ల కేసులో శిక్ష పడ్డరామ్ రతన్ సోనీ నుంచి తెల్గీ ఫోర్జరీ మెలకువలు నేర్చుకున్నాడు. జైలునుంచి బయటికొచ్చేందుకు అధికారులకు లంచమిచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. -
ఏ దర్యాప్తునకైనా సిద్ధం
సీఎం సిద్ధు బెంగళూరు: విక్టోరియా ఆసుపత్రి ఆవరణంలో రోగ నిర్ధారణ పరీక్షలు జరపడానికి అవసరమైన ల్యాబ్‌ను ఏర్పాటు చేసే టెండర్‌ను మ్యాట్రిక్స్ ఇమేజింగ్ సొల్యూషన్ సంస్థ దక్కించుకోవడం వెనుక తన పాత్ర ఏమీ లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. తన కుమారుడు యతీంద్ర ఆ సంస్థకు డెరైక్టర్‌గా ఉన్నంత మాత్రానా అక్రమాలు జరిగాయనడం సరికాదన్నారు. ఈ విషయంలో ఏ సంస్థతో దర్యాప్తు జరిపినా తనకు అభ్యంతరం లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కరువు పర్యటనలో ఉన్న సిద్ధరామయ్య రాయచూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఆదివారం మాట్లాడారు. తాను ధరించిన వాచ్ విషయమై అనవసర రాజకీయాలు చేసిన విపక్ష పార్టీలు ప్రస్తుతం విక్టోరియా విషయమై అదే పంథాను అనుసరిస్తున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేడియోలజిస్ట్ అయిన రాజశేఖర్ గౌడ 2009లో మ్యాట్రిక్స్ సొల్యూషన్‌ను స్థాపించారు. పథాలజిస్ట్‌గా పనిచేస్తున్న తన కుమారుడు యతీంద్ర 2014లో మ్యాట్రిక్స్ సొల్యూషన్ డెరైక్టర్‌గా ఆ సంస్థ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా ఆ సంస్థ టెండర్‌ను దక్కించుకుని విక్టోరియా ఆసుపత్రిలో ల్యాబ్‌ను ఏర్పాటు చేసే అవకాశం చేజెక్కించుకుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వ ఆసుపత్రులు వసూలు చేసే రుసుములతో పోలిస్తే దాదాపు 20 శాతం తక్కువగా మ్యాట్రిక్స్ సొల్యూషన్ సంస్థ రోగుల నుంచి వసూలు చేస్తుంది. ఈ విషయంలో ఎటువంటి అక్రమాలు తావులేదు.’ అని పేర్కొన్నారు. తాను ఇప్పటికే విక్టోరియా విషయమై ఏమైనా అక్రమాలు జరిగి ఉంటే దర్యాప్తు చేసి టెండర్ ప్రక్రియను రద్దు చేయాల్సిందిగా వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్‌ప్రకాశ్ పాటిల్‌కు ఆదేశాలు జారీ చేసానని సిద్ధరామయ్య తెలిపారు. తన కుమారుడు తన నుంచి ఎటువంటి సహకారం తీసుకోలేదన్నారు. అంతేకాకుండా సక్రమంగా పన్నులు కూడా చెల్లిస్తున్నారని సిద్ధరామయ్య వివరించారు. ఈ విషయమై ఏ సంస్థ అయినా దర్యప్తు జరిపినా తాను పూర్తిగా సహకరిస్తానని సిద్ధరామయ్య తెలిపారు. అక్రమాలు జరిగినట్లు తేలితే చట్టం ప్రకారం శిక్ష అనుభవించడానికి సిద్దమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లలో ఏ ఒక్క విషయంలో కూడా అక్రమాలు చోటు చేసుకోలేదన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని దీన్ని ఓర్చుకోలేని విపక్షాలు తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయని సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. -
విక్టోరియా ఆస్పత్రికి చేరుకున్న నిత్యానంద
బెంగళూరు : కోర్టు ఆదేశాల నేపథ్యంలో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద సోమవారం ఉదయం పుంసత్వ పరీక్ష నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి చేరుకున్నారు. కాసేపట్లో వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించనున్నారు. లైంగిక సామర్థ్య పరీక్షలకు హాజరు కావల్సిందిగా సీఐడీ డీఎస్పీ నాలుగు రోజుల క్రితం నిత్యానందకు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. నిత్యానందపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. వాటిలో ఒక కేసుకు సంబంధించి అతనికి పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని రామనగర జిల్లా కోర్టు ఆదేశించింది. అయితే జిల్లా కోర్టు ఆదేశాలపై నిత్యానంద హైకోర్టును ఆశ్రయించారు. పురుషత్వ పరీక్షల నుంచి తనను మినహాయించాలని హైకోర్టును కోరారు. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవని, అందువల్ల తనకు పురషత్వ పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన హై కోర్టు నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. కేసుకు సంబంధించిన సాధారణ ప్రజల మాదిరిగానే నిత్యానందను విచారించాలని అవసరమైన పరీక్షలు నిర్వహించవచ్చునని కోర్టు తీర్పు చెప్పింది. కింది కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. జులై 28 నుంచి నిత్యానందను పోలీసులు కష్టడీలోకి తీసుకుని పురుషత్వ, రక్త తదితర పరీక్షలతో పాటు విచారణ కూడా చేయవచ్చునని హైకోర్టు తెలిపింది. దాంతో సిఐడి అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. -
నేడు నిత్యానందకు పుంసత్వ పరీక్ష
బెంగళూరు: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సోమవారం ఇక్కడి విక్టోరియా ఆస్పత్రిలో పుంసత్వ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ రోజు పరీక్షలకు హాజరు కావాల్సిందిగా మూడు రోజుల క్రితం నిత్యానందకు సీఐడీ డీఎస్పీ లోకేశ్ నోటీసు జారీ చేశారు. ఓ అత్యాచారం కేసులో నిత్యానందకు పుసంత్వ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. -
నవదంపతుల మృత్యువాత
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో అనంతపురానికి చెందిన కొత్త దంపతులు మృత్యువాత పడినట్లు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. పిడుగులాంటి వార్త విన్న కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. దేవుడు ఆరునెలలకే ఆ దంపతుల జీవితాన్ని ముగించేశాడంటూ రోదించారు. మృతదేహాల కోసం అనంతపురం నుంచి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నారు. మృతదేహాలను బుధవారం అప్పగిస్తామని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో వారంతా అక్కడే పడగాపులు గాస్తున్నారు. అనంతపురంలోని నీలిమ థియేటర్ సమీపంలో పోస్టల్ కరస్పాండెంట్ క్లర్క్ చంద్రశేఖర్, అనసూయ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శ్రీనివాస్ (28), శ్రీకాంత్ ఇద్దరు కుమారులు. ఇద్దరూ బెంగళూరులోని ప్రెవేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఆరునెలల క్రితం తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీలతతో శ్రీనివాస్ వివాహం జరిగింది. శ్రీలత, శ్రీనివాస్ దంపతులు బెంగళూరులో ఉంటున్నారు. ఈ క్రమంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లేందుకు వారు అనంతపురం రావాలనుకున్నారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీనివాస్ తన తండ్రి చంద్రశేఖర్‌కి ఫోన్ చేసి అనంతపురం వస్తున్నట్లు చెప్పాడు. ఇంతలోనే దంపతులిద్దరూ ప్రమాదంలో చిక్కుకున్నారని సమాచారం అందడంతో శ్రీనివాస్ తల్లిదండులు తల్లడిల్లిపోయారు. 24 గంటల అనంతరం శ్రీలత, శ్రీనివాస్ మృత్యువాత పడ్డారని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.