ఏ దర్యాప్తునకైనా సిద్ధం
సీఎం సిద్ధు
బెంగళూరు: విక్టోరియా ఆసుపత్రి ఆవరణంలో రోగ నిర్ధారణ పరీక్షలు జరపడానికి అవసరమైన ల్యాబ్‌ను ఏర్పాటు చేసే టెండర్‌ను మ్యాట్రిక్స్ ఇమేజింగ్ సొల్యూషన్ సంస్థ దక్కించుకోవడం వెనుక తన పాత్ర ఏమీ లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. తన కుమారుడు యతీంద్ర ఆ సంస్థకు డెరైక్టర్‌గా ఉన్నంత మాత్రానా అక్రమాలు జరిగాయనడం సరికాదన్నారు. ఈ విషయంలో ఏ సంస్థతో దర్యాప్తు జరిపినా తనకు అభ్యంతరం లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కరువు పర్యటనలో ఉన్న సిద్ధరామయ్య రాయచూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఆదివారం మాట్లాడారు. తాను ధరించిన వాచ్ విషయమై అనవసర రాజకీయాలు చేసిన విపక్ష పార్టీలు ప్రస్తుతం విక్టోరియా విషయమై అదే పంథాను అనుసరిస్తున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేడియోలజిస్ట్ అయిన రాజశేఖర్ గౌడ 2009లో మ్యాట్రిక్స్ సొల్యూషన్‌ను స్థాపించారు. పథాలజిస్ట్‌గా పనిచేస్తున్న తన కుమారుడు యతీంద్ర 2014లో మ్యాట్రిక్స్ సొల్యూషన్ డెరైక్టర్‌గా ఆ సంస్థ బాధ్యతలు చేపట్టారు.
ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా ఆ సంస్థ టెండర్‌ను దక్కించుకుని విక్టోరియా ఆసుపత్రిలో ల్యాబ్‌ను ఏర్పాటు చేసే అవకాశం చేజెక్కించుకుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వ ఆసుపత్రులు వసూలు చేసే రుసుములతో పోలిస్తే దాదాపు 20 శాతం తక్కువగా మ్యాట్రిక్స్ సొల్యూషన్ సంస్థ రోగుల నుంచి వసూలు చేస్తుంది. ఈ విషయంలో ఎటువంటి అక్రమాలు తావులేదు.’ అని పేర్కొన్నారు. తాను ఇప్పటికే విక్టోరియా విషయమై ఏమైనా అక్రమాలు జరిగి ఉంటే దర్యాప్తు చేసి టెండర్ ప్రక్రియను రద్దు చేయాల్సిందిగా వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్‌ప్రకాశ్ పాటిల్‌కు ఆదేశాలు జారీ చేసానని సిద్ధరామయ్య తెలిపారు. తన కుమారుడు తన నుంచి ఎటువంటి సహకారం తీసుకోలేదన్నారు. అంతేకాకుండా సక్రమంగా పన్నులు కూడా చెల్లిస్తున్నారని సిద్ధరామయ్య వివరించారు. ఈ విషయమై ఏ సంస్థ అయినా దర్యప్తు జరిపినా తాను పూర్తిగా సహకరిస్తానని సిద్ధరామయ్య తెలిపారు. అక్రమాలు జరిగినట్లు తేలితే చట్టం ప్రకారం శిక్ష అనుభవించడానికి సిద్దమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లలో ఏ ఒక్క విషయంలో కూడా అక్రమాలు చోటు చేసుకోలేదన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని దీన్ని ఓర్చుకోలేని విపక్షాలు తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయని సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు.