కరీం తెల్గీ మృతి | Abdul Karim Telgi, convict in fake stamp paper scam, dies in Bengaluru | Sakshi
Sakshi News home page

కరీం తెల్గీ మృతి

Published Fri, Oct 27 2017 1:45 AM | Last Updated on Fri, Oct 27 2017 10:18 AM

Abdul Karim Telgi, convict in fake stamp paper scam, dies in Bengaluru

సాక్షి, బెంగళూరు: సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల నకిలీ స్టాంప్‌ పేపర్ల కుంభకోణం సూత్రధారి అబ్దుల్‌ కరీం తెల్గీ(56) గురువారం మృతిచెందాడు. మెనింజైటిస్, బహుళ అవయవ వైఫల్యంతో వారం రోజులుగా తెల్గీ బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, గురువారం గుండెపోటు రావడంతో పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు చెప్పారు. జైలులో ప్రత్యేక మర్యాదలు పొందిన వారిలో తెల్గీ ఉన్నారని అప్పటి కర్ణాటక డీఐజీ ఆరోపించడంతో ఆయన మళ్లీ వార్తల్లోకెక్కారు. నకిలీ స్టాంప్‌ పేపర్ల కేసులో తెల్గీ 2001లో అజ్మీర్‌లో అరెస్టయ్యాడు. 2006లో కోర్టు ఆయనకి 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.202 కోట్ల జరిమానా విధించింది. గత 16 ఏళ్లుగా బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో ఉన్న సమయంలో తెల్గీకి హెచ్‌ఐవీ సిరంజి ఎక్కించారని ఆయన తరఫు లాయర్‌ గతంలో కోర్టుకు చెప్పారు.

నాయకులు, సెక్యూరిటీ ప్రెస్‌ అండతోనే..
1994లో స్టాంప్‌ పేపర్‌ లైసెన్స్‌ సంపాదించిన తెల్గీ ముంబై మింట్‌ రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. రెవెన్యూ శాఖ, స్టాంప్‌ కార్యాలయం, నాసిక్‌ సెక్యూరిటీ ప్రెస్‌లోని అధికారులతో స్నేహం పెంచుకున్నాడు. తనకున్న రాజకీయ సాన్నిహిత్యంతో నాసిక్‌ ప్రెస్‌లో యంత్రాల్ని పనికిరానివిగా ప్రకటించేలా చేసి వాటిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిని కొని ముంబైలోని తన కార్యాలయంలో స్టాంపు పేపర్ల ముద్రణను ప్రారంభించాడు. నాసిక్‌ ప్రెస్‌ భద్రతా అధికారుల సాయంతో స్టాంపుల ముద్రణ రంగుల్ని సంపాదించాడు. 350 మంది ఏజెంట్ల సాయంతో భారీ స్థాయిలో నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని కొనసాగించాడు. వారు బ్యాంకులు, బీమా కంపెనీలు, స్టాక్‌ బోక్రరేజ్‌ సంస్థలు, కార్పొరేట్‌ కార్యాలయాలకు పెద్ద మొత్తంలో నకిలీ స్టాంపుల్ని విక్రయించేవారు. అధికారంలో ఉన్న నేతలు, పోలీసు అధికారుల సహకారంతో తెల్గీ ఈ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. నార్కో పరీక్షల్లో అనేకమంది ప్రముఖుల పేర్లను వెల్లడించాడు.

మలుపు తిప్పిన జైలు జీవితం
సాధారణ రైల్వే ఉద్యోగి కుమారుడైన అతను 2001లో అరెస్టయ్యే వరకూ రాజకీయ నాయకులు, పోలీసుల సాయంతో అనేక రాష్ట్రాల్లో అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. నకిలీ తెల్గీ అక్రమాల విలువ దాదాపు రూ.20వేల కోట్లు. దేశ ఆర్థిక మార్కెట్లను కుదిపేసిన ఈ అక్రమాల తీవ్రత దాదాపు రూ.33వేలకోట్లు. కర్ణాటకలోని బెలగావి జిల్లా ఖానాపూర్‌కు చెందిన తెల్గీ చిన్నతనంలో రైళ్లలో కూరగాయలు, పళ్లు అమ్మేవాడు. బెలగావి కాలేజీ నుంచి బీకాం డిగ్రీ సంపాదించాక సౌదీకి వెళ్లాడు. అక్కడ దాదాపు ఏడేళ్లు గడిపి తిరిగి ముంబైకి చేరాక అండర్‌ వరల్డ్‌ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు. యువకులను దుబాయ్‌ పంపిస్తానని మోసగించిన కేసులో ముంబై పోలీసులు 1991లో తెల్గీని అరెస్ట్‌ చేశారు. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. నకిలీ షేర్ల కేసులో శిక్ష పడ్డరామ్‌ రతన్‌ సోనీ నుంచి తెల్గీ ఫోర్జరీ మెలకువలు నేర్చుకున్నాడు. జైలునుంచి బయటికొచ్చేందుకు అధికారులకు లంచమిచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement