సాక్షి, బెంగళూర్ : దేశాన్ని ఆర్థికంగా కుదిపేసిన నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం ప్రధాన సూత్రధారిగా అబ్దుల్ కరీం తెల్గీ ఆరోగ్యం విషమించినట్లు సమాచారం. ప్రస్తుతానికి బతికే ఉన్నప్పటికీ.. వెంటిలేటర్‌పై ఉన్నట్లు కరీం తరపు న్యాయవాది ఎంటీ నన్నయ్య మీడియాకు తెలిపారు. సుదీర్ఘ అనారోగ్యంతో కరీం బాధపడుతుండగా.. పరిస్థితి విషమించటంతో నాలుగు రోజుల క్రితం బెంగళూర్‌లోని విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు.
నరాల సంబంధిత వ్యాధితో కరీం బాధపడుతున్నాడని నన్నయ్య చెప్పారు. మరికాస్త ముందే కరీంను ఆస్పత్రికి తీసుకొచ్చి ఉంటే ఇలా ఉండేది కాదని ఆయన చెబుతున్నాడు. కాగా, గత 20 ఏళ్లుగా డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి వ్యాధులతో సతమతమవుతున్న ఆయన.. ఎయిడ్స్ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెదడు నుంచి వెన్నెముకకు దారితీసే కండరాలు, రక్తనాళాలు బలహీనపడ్డాయని, దీంతో ఆయన కదల్లేని స్థితిలో ఉన్నారని చెబుతున్నారు.
కాగా, వేల కోట్లకు సంబంధించిన నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో నిందితుడిగా ఉన్న తెల్గీని అజ్మీర్ లో నవంబర్ 2001లో తెల్గీని అరెస్ట్ చేశారు. దోషిగా తేలటంతో కోర్టు 30 సంవత్సరాల కఠిన శిక్ష విధించగా.. అప్పటి నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆయన్ను ఉంచారు. అంతేకాదు రూ. 202 కోట్ల జరిమానాను విధించింది కూడా. ఆ మధ్య ఈయనకు జైల్లోనే చికిత్స అందించారంటూ జైళ్ల మాజీ డీఐజీ రూప ఆరోణలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment