వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, కామాంధుల వేధింపులు, అనారోగ్యం.. ఇలా ఎన్నో సమస్యలు మహిళలను సజీవ దహనానికి పురికొల్పుతున్నాయి. పోలీసులు, మహిళా శిశుసంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ కేంద్రాలు ఎలాంటి భరోసా నింపలేకపోతున్నాయి. కాలిన గాయాల బాధితుల్లో పురుషలు కంటే మహిళలే అధికంగా ఉండడం సమాజంలో వారి భద్రత ఎంత దీనంగా ఉందో చెబుతోంది.
సాక్షి, బెంగళూరు: ప్రమాదవశాత్తూ శరీరం కాలిపోయిన రోగుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలోని విక్టోరియా ఆస్పత్రిలో కాలిన వారికి చికిత్స చేసేందుకు ప్రత్యేక వార్డు కేటాయించారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్ల నివేదికలు చేదు వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలు కోల్పోయిన వారిలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. చాలామంది కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన తర్వాత మృత్యువుతో పోరాడి ఓడిపోతున్నారు.
ఆత్మహత్యాయత్నాలే అధికం
సరైన వైద్యం అందకపోవడంతోనే మృత్యువాత పడుతున్నారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే కాలిన శరీరాలతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలు కోల్పోతున్న వారిలో ప్రమాదవశాత్తూ కాలిన వారి కంటే ఆత్మహత్యాయత్నం చేసి గాయపడినవారే అధికమని నివేదికలు పేర్కొంటున్నాయి. కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్న కేసులే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక వార్డులో చికిత్స
నగరంలో సెయింట్ జాన్స్ ఆస్పత్రి కాకుండా విక్టోరియా ఆస్పత్రిలో కాలిన గాయాలకు చికిత్స చేసే నిమిత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. నగరంలో సుమారు 40 శాతం కాలిన కేసులు విక్టోరియాలో చికిత్స తీసుకున్నట్లు ఆస్పత్రి రికార్డుల ద్వారా తెలుస్తోంది. గణాంకాలతో పోల్చితే ప్రతి ఏటా మహిళల సంఖ్య కంటే పురుషులు తక్కువగానే ఉన్నారు. అయితే 2018లో మాత్రం మహిళలు 347 ఉండగా.. పురుషులు 477 మంది ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అంతేకాకుండా ప్రతి ఏటా బాధితుల సంఖ్య కూడా తగ్గుతుండటం శుభసూచకం.
కుటుంబ సమస్యలదే పాపం
కాలిన గాయాలతో విక్టోరియా ఆస్పత్రిలో చేరుతున్న వారిలో ఎక్కువ మంది ఆత్మహత్యకు పాల్పడిన వారే ఉండటం విశేషం. అందులోనూ కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్న వారే అధికం. అంతేకాకుండా చాలా మంది కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భర్త తల్లిదండ్రులు, ఆడపడుచులతో విభేదాలే ఆత్మహత్యాయత్నాలకు కారణమని మహిళ తరఫు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆస్పత్రుల బాట పడుతున్న వారు విక్టోరియా ఆస్పత్రికే ఎక్కువ మంది వస్తున్నారు. కాగా రెండోస్థానంలో సెయింట్‌జాన్ ఆస్పత్రి ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment