
ముందు సెల్వం, తర్వాత శశికళ..
చెన్నై: తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఇంచార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలిసేందుకు పన్నీర్ సెల్వం, శశికళ నటరాజన్ సిద్ధమవుతున్నారు. గవర్నర్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని వీరిద్దరూ కోరనున్నారు. ముందుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ సాయంత్రం 5 గంటలకు విద్యాసాగర్ రావును పన్నీర్ సెల్వం కలవనున్నారు. రాత్రి 7.30 గంటలకు గవర్నర్ తో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ భేటీ కానున్నారు.
శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను ఆయన కోరే అవకాశముంది. మెజారిటీ ఎమ్మెల్యేలు తన పక్షాన ఉన్నందున ముఖ్యమంత్రిగా తనకే అవకాశం ఇవ్వాలని శశికళ అభ్యర్థించనున్నారు.