
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల నుంచి శశికళ అకస్మాత్తుగా తప్పుకోవడంలో ఇద్దరు వ్యక్తులు ప్రధాన పాత్ర పోషించిన విషయం శుక్రవారం వెలుగుచూసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి రావాలని శశికళ భావించారు. కుదిరితే అన్నాడీఎంకేను చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవడం లేదా టీటీవీ దినకరన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’(ఏఎంఎంకే) ద్వారా ప్రజల్లోకి దూసుకెళ్లాలని ఆశించారు. ఇదే విషయాన్ని గత నెల 24న జయలలిత జయంతి రోజున బహిరంగంగా ప్రకటించారు. అయితే అన్నాడీఎంకే స్వాధీనంలోకి వచ్చే పరిస్థితులు కనపడలేదు. దినకరన్ వైఖరి వల్ల అతడిని దూరం పెట్టారు. ఏం చేయాలి చెప్మా అని ఆమె ఆలోచనలోపడ్డారు.
ఇదే సమయంలో తమ కూటమి గెలుపు అవకాశాలను దెబ్బతీయాలని పట్టుదలతో ఉన్న శశికళను బుజ్జగించేందుకు బీజేపీకి చెందిన ఒక దూత ఆమెను స్వయంగా కలుసుకున్నారు. మనం మనం కీచులాడుకుంటే ఓట్లు చీలిపోయి అధికార పీఠాన్ని డీఎంకే తన్నుకు పోగలదు, రాజకీయాల నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలని సూచించారు. ఇదే సమయంలో సమీప బంధువొకరు శశికళను కలిసి మరో కోణంలో మాట కలిపారు. ఒంటరిగా బరిలోకి దిగితే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు అవుతుంది, ఆన్నాడీఎంకే ఓటమి పాలైతే ఆ చెడ్డపేరు నీకు చుట్టుకుంటుందని హితవు పలికారు. వీరిద్దరి సలహాతోనే రాజకీయాల నుంచి శశికళ తప్పుకున్నారనే సమాచారం శుక్రవారం బహిర్గతమైంది.
శశికళ వెనుక వెన్నుపోటుదారులు..
టీటీవీ దినకరన్, మరికొందరు వెన్నుపోటుదారుల వల్లనే రాజకీయాల నుంచి శశికళ తప్పుకోవాల్సి వచ్చిందని స్వయానా ఆమె తమ్ముడు,‘అన్నా ద్రావిడర్ కళగం’ప్రధాన కార్యదర్శి దివాకరన్ వ్యాఖ్యానించారు. తనకు తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకోవడం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను కూటమిగా మలుస్తూ అన్నాడీఎంకేను ఆహ్వానించడం వంటి పిల్లచేష్టలకు పాల్పడిన దినకరన్‌తో ఆమె విరక్తి చెందారని ఆయన వ్యాఖ్యానించారు.