అక్క రౌద్రం... చిన్నమ్మ శాంతం! | Vardhelli Murali Article On Mamata Banerjee And Sasikala Political Journey | Sakshi
Sakshi News home page

అక్క రౌద్రం... చిన్నమ్మ శాంతం!

Published Sun, Mar 7 2021 1:48 AM | Last Updated on Sun, Mar 7 2021 7:35 AM

Vardhelli Murali Article On Mamata Banerjee And Sasikala Political Journey - Sakshi

‘అక్క’ స్వభావం అంతే. ఏదైనా పోరాడి సాధించుకోవడమే. ఛాత్ర పరిషత్‌ (కాంగ్రెస్‌ విద్యార్ధి సంఘం) కార్యకర్తగా కల కత్తాలో వీధి పోరాటాలకు నాయకత్వం వహించేది. ఇరవై తొమ్మిదేళ్ల వయసులో లోక్‌సభకు ఎన్నికయ్యింది. అదీ మార్క్సిస్టు దిగ్గజం సోమనాథ్‌ ఛటర్జీని ఓడించి. ఫలితంగా ఎర్ర చొక్కాల ఆగ్రహానికి గురైంది. తర్వాతి ఎన్నికల్లో ఒక సాధారణ మహిళను నిలబెట్టి అక్క (దీదీ)ను ఓడించారు. ఓటమిని అంగీ కరించడం దీదీ స్వభావం కాదు. మరింత పట్టుదలగా పోరా డింది. మార్క్సిస్టు ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా పోరా డింది. తాను పోరాడుతున్నది కమ్యూనిస్టు భీష్మ–ద్రోణులైన జ్యోతిబసు–దాస్‌గుప్తాల కాంబినేషన్‌తోనని తెలుసు. కొండతో ఢీకొంటున్నాననీ తెలుసు. అయినా కొట్లాడింది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తగా పదేళ్లు కొట్లాడింది. కాంగ్రెస్‌ నాయకత్వంలో సమర శీలత కొరవడిందని ఆమె నిర్ధారణకు వచ్చింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పేరుతో సొంత పార్టీ స్థాపించింది. కమ్యూనిస్టు వృద్ధ నేతలు తప్పుకున్న తర్వాత బుద్ధదేవ్‌–బిమన్‌ బసుల కాంబినేషన్‌తోనూ పోరాడింది. మరో పదేళ్ల పోరాటం తర్వాత దీదీ సాధించింది. మమతా బెనర్జీ ఉరఫ్‌ దీదీ క్రీ.శ. 2011లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

ఆమె రౌద్రం ఇంకా తగ్గలేదు. తరుముకొస్తున్న బీజేపీతో తలపడేందుకు సర్వశక్తులూ కూడదీసుకుంటున్నది. బీజేపీ విసు రుతున్న బాణాలు తనువున విరుగుతున్నా తలొగ్గడం లేదు. దెబ్బతిన్న బెబ్బులిలా గాండ్రిస్తున్నది. బ్రిగేడ్‌ పరేడ్‌ మైదానం దద్దరిల్లేలా గాండ్రిస్తున్నది.

వివేకానందన్‌ కృష్ణవేణి శశికళా నటరాజన్‌ స్వభావరీత్యా శాంతమూర్తి మాత్రం కాదు. మమతా బెనర్జీని మించిన ఫైర్‌ బ్రాండ్‌ నేత జయలలిత. మూడు దశాబ్దాలపాటు ఆమె వెన్నంటి నడిచిన నీడ శశికళ. ‘మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ...’ అన్నారు. జయ పాలిటి ఆ భాగ్యం శశికళ. శశికళకు దొరికిన ఆ స్వర్గం జయలలిత. జయలలిత ఆవేశ కావేశాలను కంట్రోల్‌ చేసే రిమోట్‌గా శశికళ ఎదిగింది. ఫైర్‌ బ్రాండ్‌ అడుగులో అడుగేసి నడిచినందువల్ల ఆ ధిక్కార స్వభావమూ చిన్నమ్మకు అలవడింది. తన నెచ్చెలికి చిరకాల ప్రత్య ర్థిగా నిలబడిన కరుణానిధి చాణక్యాన్ని దగ్గరగా చూసినందు వల్ల సందర్భాన్ని బట్టి మసలుకునే లగువు బిగువుల లౌక్యమూ ఆమెకు అలవడింది. జయలలిత మరణానంతరం ముసురు కొస్తున్న ఒత్తిళ్లకు హెచ్చరిక అన్నట్టుగా జయ సమాధిపై ప్రతిజ్ఞ చేసి రెండుసార్లు గట్టిగా చరిచినప్పుడు శశికళ ఎక్కుపెట్టిన ఏకే– 47 తుపాకీలా కనిపించింది. నాలుగేళ్లు జైలు జీవితం గడిపి వచ్చినప్పుడు తనకు తమిళనాట వీరస్వాగతం లభించినప్పటికీ, తను రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించి అంద రినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడామె గోడమీద వేలాడదీసిన తుపా కీలా కనబడుతున్నది. ఆ తుపాకీ ట్రిగ్గర్‌ మీద వేలు పడేంత వరకే శాంత ముద్ర.

నాలుగు రాష్ట్రాలూ, ఒక కేంద్రపాలిత ప్రాంతం శాసన సభల ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ విజిల్‌ ఊదింది. కానీ, అంత కంటే చాలాకాలం ముందునుంచే ఆ రాష్ట్రాలు వేడెక్కాయి. ఇందులో పెద్ద రాష్ట్రాలైన బెంగాల్, తమిళనాడులను కలిపితే ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ సీట్లకంటే ఒకటెక్కువే. పుదుచ్చేరిలో ఒక్కటే లోక్‌సభ స్థానం. ఆ ఎన్నికల ప్రాధాన్యం కూడా అంతే. కేరళ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. ఒకసారి ఎల్‌డీఎఫ్, ఒకసారి యూడీఎఫ్‌. నాలుగు దశాబ్దాలుగా ఇదే కేరళ తీరు. కానీ ఈసారి అధికారంలో వున్న ఎల్‌డీఎఫ్‌ కూటమే మళ్లీ గెలుస్తుందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇదే జరిగితే కేరళ ప్రజలు సంప్రదాయాన్ని  ఉల్లంఘించినట్టే. కేరళ గోల్డ్‌ స్కామ్‌లో నిందితురాలైన యువతి ఈ పాపంలో ముఖ్య మంత్రికి కూడా భాగం ఉందని కస్టమ్స్‌ అధికారులకు చెప్పిం దట. అది కూడా అరెస్టయిన అనేక నెలల తర్వాత సరిగ్గా ఎన్నికల ముందే చెప్పిందట. ఈ కారణంగా కేరళ రాజకీయాలు తలకిందులై మూడో పక్షమైన బీజేపీ అవకాశాలు ఏమేరకు పెరుగుతాయో చూడాలి. బహుశా, ఇటువంటి అంచనా ఏదో బీజేపీ నాయకత్వానికి ఉన్నట్టుంది. అందుకే ఎనభై ఎనిమిదేళ్ల నవయువకుడైన మెట్రో శ్రీధరన్‌కు వీరకంకణం కట్టి నుదుట తిలకం దిద్ది సర్వసేనానిగా ప్రకటించి రంగంలోకి దింపారు. ఎన్నికల రణరంగంలో ఆయన ఏమేరకు వీరవిహారం చేస్తారో చూడాలి. అస్సాంలో ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపీ కూటమే గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తే కాంగ్రెస్‌ కూటమి నుంచి అధికార కూటమి గట్టి పోటీనే ఎదుర్కొంటున్నట్టు కనిపి స్తున్నది. ఫలితం తిరగబడే అవకాశం లేకపోలేదు. మిత్రపక్షా లతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టగలిగే అవకాశాలున్న రాష్ట్రాలు కేరళ, అస్సాం మాత్రమే. అందుకే ఆ రాష్ట్రాల్లో రాహుల్, ప్రియాంకలు ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కి స్తున్నారు. కేరళ గజ ఈతగాళ్ల సమక్షంలో రాహుల్‌ సముద్రం లోకి దూకి కాస్సేపు క్రీడించారు. అస్సాం టీ ఎస్టేట్‌లో ప్రియాంక తేయాకు తెంపే కార్మికురాలి వేషంలో దర్శన మిచ్చింది. కాంగ్రెస్‌ ప్రచారాన్ని మెయిన్‌ ట్రాక్‌లో రాష్ట్రాల నేతలు నడిపిస్తుంటే సైడ్‌ట్రాక్‌లో రాహుల్, ప్రియాంకల చమత్కార షోలు నడుస్తున్నాయి.

పెద్ద రాష్ట్రాలైన బెంగాల్, తమిళనాడు ఎన్నికలే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమ సాంస్కృతిక వారసత్వమే గొప్పదని బెంగాలీలు ఎంత గట్టిగా నమ్ముతారో అంతకంటే గట్టిగా తమిళులూ విశ్వసిస్తారు. వాళ్లు రవీంద్రనాథ్‌ టాగోర్‌ను చూపెడితే వీళ్లు సుబ్రమణ్య భారతిని చూపెడతారు. వాళ్లకు సత్యజిత్‌రే ఉంటే వీళ్లకు కె. బాలచందర్‌ ఉంటారు. వాళ్లకు మృణాల్‌సేన్‌ ఉంటే వీళ్లకు మణిరత్నం ఉన్నాడు. ఆర్‌డి బర్మన్‌ బెంగాలీ–ఏఆర్‌ రెహమాన్‌ తమిళ్‌. ఇలా చూసుకుంటూ పోతే అన్ని రంగాల్లోనూ ఎందరో ఉద్దండులు ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. సాంబార్‌ రసం, రసగుల్లాలతో కూడా జైత్ర యాత్ర చేసిన రాష్ట్రాలివి. ఎకనామిక్స్‌లో ఇద్దరు నోబెల్‌ గ్రహీ తలు బెంగాల్‌లో ఉంటే సైన్స్‌లో ముగ్గురు నోబెల్‌ గ్రహీతలు తమిళనాడువారు. కళా, సాహిత్య, విద్యా, వైజ్ఞానిక, సంగీత రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉన్న రాష్ట్రాల్లో ఈ రెండూ ప్రధానమైనవి. పురోగామి ఆలోచనలున్న ప్రజలు విస్తారంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజాతీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి దేశ వ్యాప్తంగా ఉండడం సహజం.

ఫైర్‌బ్రాండ్‌ నాయకులను ఇష్టపడే స్వభావం బెంగాలీలది. అందుకే గాంధీ నెహ్రూలకంటే ఎక్కువగా సుభాష్‌ చంద్ర బోస్‌ను ఆరాధిస్తారు. బెంగాలీ భగత్‌సింగ్‌గా భావించే చిట్ట గాంగ్‌ హీరో సూర్యసేన్‌ను ప్రేమిస్తారు. కమ్యూనిస్టులను ఆద రించారు. నక్సల్బరీని గుండెలకు హత్తుకున్నారు. జ్యోతిర్మయ బసు వంటి ఫైర్‌బ్రాండ్‌ పార్లమెంటేరియన్లను భారీ మెజా రిటీతో గెలిపించారు. ఆయన తర్వాత ఆ లక్షణాన్ని మమతా బెనర్జీలో బెంగాలీలు గుర్తించారు. ఆమె సుదీర్ఘకాలం పోరాడిన తర్వాతనే అధికారాన్ని అప్పగించారు. ఆ తెగువను మరోసారి ప్రదర్శిస్తూ నందిగ్రామ్‌ ఒక్కచోట నుంచే బరిలోకి దిగుతూ దీదీ బీజేపీకి చాలెంజ్‌ విసిరింది. ఈ నియోజకవర్గం తృణమూల్‌ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి కంచుకోట. ఈ సాహసం బెంగాలీలకు నచ్చే అవకాశం ఉంది. ఈస్టిండియా కంపెనీ సేనలు 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో బెంగాల్‌ నవాబు సిరాజుద్దౌలాను ఓడించిన తర్వాతనే భారతదేశంలో బ్రిటిష్‌ పాలన విస్తరించడం సాధ్యమైంది. ఇప్పుడు బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే దక్షిణభాగం మినహా భారతదేశంలో ఆ పార్టీ రాజకీయ విస్తరణ దాదాపుగా పూర్తయినట్టే. అందుకే తృణమూల్‌ శ్రేణులు బీజేపీని నాన్‌– బెంగాలీ పార్టీగా బ్రాండింగ్‌ చేసి ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ గట్టిగానే తిప్పికొట్టగలిగింది. బీజేపీకి జన్మ నిచ్చిన జనసంఘ్‌ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్‌ ముఖర్జీ బెంగాలీయేనన్న విషయాన్ని వారు ఓటర్లకు గుర్తుచేస్తున్నారు. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లోనే బెంగాల్‌లో ముగ్గురు అభ్యర్థులు జనసంఘ్‌ తరఫున గెలిచిన సంగతిని కూడా గుర్తుచేస్తున్నారు.

సర్వేలన్నీ మమతా బెనర్జీ పార్టీ విజయాన్నే సూచిస్తున్నప్ప టికీ వాటిని పూర్తిగా విశ్వసించలేము. ఎందుకంటే 2019 లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ కంటే తృణమూల్‌ కాంగ్రెస్‌కు కేవలం 2.6 శాతం ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. దళితులు, గిరిజ నులు, వెనుకబడిన వర్గాల ప్రజల ఓట్లు అధికంగా బీజేపీకి పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వర్గాలు మనసు మార్చుకున్నా యనడానికి ఎటువంటి దాఖలాలు లేవు. దళితుల్లో తూర్పు బెంగాల్‌ (బంగ్లాదేశ్‌) నుంచి వచ్చి స్థిరపడ్డవారి సంఖ్య దక్షిణ ప్రాంతంలో (ముఖ్యంగా 24 పరగణాలు) బాగా ఎక్కువ. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఫలితంగా ఈ వర్గానికి మేలు జరిగింది. కనుక ఇప్పుడు మరింత ఎక్కువ సంఖ్యలో బీజేపీకి ఈ ఓట్లు పడే అవకాశం ఉంది. ఈ చట్టం వల్ల నష్టపోయిన ముస్లిం వర్గం ఓట్లు 2019 ఎన్నికల్లోనే గంపగుత్తగా తృణమూల్‌కు పడ్డాయి. ఇప్పుడు కొత్తగా తృణమూల్‌కు కలిసివచ్చే దేమీ లేదు. పైగా ఇప్పుడు ముస్లిమ్‌ ఓట్లలో ఎంతోకొంతమేర చీలిక వచ్చే అవకాశం ఉంది. ఫర్‌ఫురా షరీఫ్‌కు చెందిన అబ్బాస్‌ సిద్దిఖీ నాయకత్వంలో ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ పేరుతో కొత్త పార్టీ ఊపిరిపోసుకుంది. బెంగాలీ మాట్లాడే ముస్లిములలో సిద్దిఖీకి బాగా పట్టుంది. ముఖ్యంగా యువతలో. ఇప్పుడు ఐఎస్‌ఎఫ్‌ లెఫ్ట్‌–కాంగ్రెస్‌ కూటమిలో చేరిపోయింది. ఇది ఏదో ఒకమేరకు తృణమూల్‌కు నష్టం కలిగించే అంశం. అయితే దీదీని వేటాడుతున్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు బూమెరాంగ్‌ అయ్యే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తున్నది. అదే జరిగితే బెంగాలీ జాతీయభావం నిద్రలేస్తే మాత్రం దీదీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. స్వాతంత్య్రోద్యమ కాలంలో బెంగాల్‌ రెండు ప్రాంతాలు కలిసి వున్నప్పుడే జాతీయ భావంతో ప్రజలు ‘బంగ మాత’ను సృష్టించుకున్నారు. ఆ తర్వాతనే భారతమాత అనే భావన వెలుగులోకి వచ్చింది. బెంగాలీల జాతీయభావం ప్రగాఢమైనది. అందుకే మమత తనను తాను రాయల్‌ బెంగాల్‌ టైగర్‌గా అభివర్ణించుకొంటున్నది. కలకత్తా కాళీమాతను గుర్తు చేస్తున్నది. ఈ సున్నిత అంశంపై జాగ్రత్తగా లేకపోతే బీజేపీకి భంగపాటు తప్పకపోవచ్చు. ఫలితం ఎలా ఉన్నా బెంగాల్లో ప్రచారం మాత్రం కొత్తపుంతలు తొక్కుతున్నది. ‘దీదీమోనీ తొమియా చాయి’ (అక్కా నువ్వే రావాలి) అనే పాట మార్మో గుతున్నది. దానికి పోటీగా ప్రముఖ గాయకుడు, పార్లమెంట్‌ సభ్యుడైన బాబుల్‌ సుప్రియోతో బీజేపీ మరో పాట పాడిం చింది. ‘ఏయీ తృణమూల్‌ ఆర్‌ నా’ (ఈ తృణమూల్‌ మళ్లీనా... వద్దువద్దు) అనే పాట కూడా ఆదరణ పొందింది.

తమిళనాడుకు సంబంధించినంతవరకూ సర్వే సంస్థలన్ని టిదీ ఒకటే మాట. ఈసారి డీఎంకే కూటమి గెలుస్తుందని చెబుతున్నారు. ఒకసారి డీఎంకే కూటమి గెలిస్తే మరోసారి అన్నాడీఎంకే గెలవడమనే సంప్రదాయం తమిళనాడులో కూడా ఉండేది. 2016లో దాన్ని బ్రేక్‌ చేసి జయలలిత విజయఢంకా మోగించింది. ఇప్పటికి రెండుసార్లు వరసగా అన్నాడీఎంకే అధి కారంలో ఉన్నందువల్ల, జయలలిత లేకపోవడంవల్ల ఓటర్లు డీఎంకేకు ఒక అవకాశం ఇవ్వచ్చునన్న అభిప్రాయం ఉంది. వరసగా పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ అన్నాడీఎంకే ప్రభు త్వంపై ఎటువంటి ప్రజావ్యతిరేకత లేకపోవడం ఒక విశేషం. ఏ దశలో చూసుకున్నా కూడా రాష్ట్రంలో డీఎంకే ఓటుబ్యాంకు కంటే అన్నాడీఎంకే ఓటుబ్యాంకు పెద్దది. అందుకు కారణం ఎంజీఆర్‌ కాలం నుంచి జయలలిత వరకు ఆ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు. పళనిస్వామి కూడా అదే ఒరవడిని కొన సాగిం చారు. అయినప్పటికీ చిన్న పార్టీలతో ఏర్పాటుచేసుకునే అల యెన్స్‌లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, పీఎంకే డీఎంకేతో ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం.

శశికళ ఈసారి అస్త్రసన్యాసం చేయడం వెనుక బీజేపీ పెద్దల దౌత్యం కూడా పనిచేసిందని సమాచారం. ఆమె రంగంలో ఉంటే అన్నాడీఎమ్‌కేలో చీలిక వస్తుంది. ఎటూ తప్పించుకోలేని ఓట మికి కారణం శశికళేననే ముద్ర పడుతుంది. భవిష్యత్తులో పార్టీ గంపగుత్తగా తన చేతికి వచ్చే అవకాశాన్ని కోల్పోవలసి వస్తుంది. పార్టీ వ్యతిరేక వైఖరి తీసుకోకుండా మౌనంగా ఉండిపోతే ఎన్నికల తర్వాత ఓటమి బాధ్యత ఈపీఎస్, ఓíపీఎస్‌ల మీద పడుతుంది. శశికళ నాయకత్వం కావాలన్న డిమాండ్‌ పెరుగు తుంది. కార్యకర్తలు ఆందోళన చేస్తారు. నిరాహారదీక్షలు చేస్తారు. పార్టీకోసం, కార్యకర్తల కోసం ఒట్టును తీసి గట్టున పెట్టి శశికళ రాజకీయ ప్రవేశం చేస్తారు. అన్నాడీఎంకే తిరుగులేని నాయ కురాలిగా అవతరిస్తారు. ఈవిధంగా ఆమెకు గురుమూర్తి రాజ కీయ ఉపదేశం చేశారని వినికిడి. ఈ వాదన చిన్నమ్మకు నచ్చింది. తుపాకీని గోడకు తగిలించింది. ఇది తాత్కాలిక యుద్ధవిరమణే.

బెంగాల్‌ ఎన్నికల్లో ఒకవేళ మమత గెలిస్తే (సర్వేలు చెబుతున్న ప్రకారం) వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల నాటికి మోదీ వ్యతిరేక కూటమికి నాయకురాలిగా మమత అవతరించవచ్చు. కాంగ్రెస్‌ పరిస్థితి రాజకుమారి పక్కనుండే ప్రధాన చెలికత్తె వేషం వేసే జూనియర్‌ ఆర్టిస్ట్‌ స్థాయికి దిగజారవచ్చు. ఒకవేళ దీదీ ఓడిపోతే పార్టీ నాయకత్వాన్ని ఆమె మేనల్లుడికి అప్పగించ వచ్చు. పోరాట చరిత్ర లేని ఆ మేనల్లుడు ఏం చేస్తాడన్నది వేచి చూడాల్సిందే. తమిళనాడులో డీఎంకే గెలిస్తే (సర్వే అంచనాల ప్రకారం) అన్నాడీఎంకే నాయకత్వం శశికళ చేతికి లభిస్తుంది. బీజేపీ కూటమిలో ఒక కీలక మద్దతుదారుగా అవతరిస్తుంది. ఏమో... గుర్రం ఎగరావచ్చు అన్న చందంగా అన్నాడీఎంకే గెలిస్తే శశికళ భవిష్యత్తుపై బీజేపీ నాయకత్వం పునరాలోచన చేయవలసి ఉంటుంది. రేపు మహిళా దినోత్సవం రోజున మమతక్క, శశి పిన్నీ పునరుత్తేజితులై రాబోయే యుద్ధాలకు సిద్ధపడతారని భావించవచ్చు.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement