చెన్నె: జైలు శిక్ష అనుభవించి చెన్నె చేరుకున్న శశికళపై తమిళనాడు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టింది. నిన్న ఆస్తుల జప్తు చేయగా తాజాగా నేడు ముఖ్యమంత్రి నేరుగా ఆమెపై, ఆమె వర్గానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దివంగత నాయకురాలు జయలలితకు అసలైన వారసులం తామేనని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. అన్నాడీఎంకేని నాశనం చేయడానికి విష శక్తులు కుట్రలు పన్నుతున్నాయంటూ వి.కె.శశికళపై పరోక్షంగా విమర్శించారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పళని మాట్లాడారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన వాళ్లు పార్టీని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి పార్టీ నుంచి తొలగించామని, మళ్లీ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి చేర్చుకోబోమని స్పష్టం చేశారు. ఎన్ని జిమ్మిక్కులకు పాల్పడినా.. వారి ఆటలు సాగవని పేర్కొన్నారు. టీటీవీ దినకరన్ వర్గం తలకిందులుగా తపస్సు చేసినా వారు అనుకున్నది ఎన్నటికీ జరగదని ప్రకటించారు. అమ్మ జయలలిత ఆశీస్సులు తమకే ఉన్నాయని సీఎం పళని స్వామి తెలిపారు.
తమిళనాడులో కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. శశికళ రాకతో రాజకీయం రాజకీయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే తన పార్టీనేనని, రెండాకుల గుర్తు కోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల్లో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.
ఈసీ దక్షిణాది పర్యటన: 15 తర్వాత మినీ సమరం?
Comments
Please login to add a commentAdd a comment