జైలు నుంచి శశికళ విడుదల!
- 30 రోజుల పెరోల్‌పై చెన్నైకి చిన్నమ్మ
బెంగళూరు: తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువైన అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ జైలు నుంచి విడుదలకానున్నట్లు తెలిసింది. అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆమెకు 30 రోజుల పెరోల్ లభించినట్లు పలు మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. సోమవారం సాయంత్రమే ఆమె జైలు నుంచి విడుదలై, నేరుగా చెన్నైకి వెళతారని సమాచారం. ఏప్రిల్‌లో మేనల్లుడు మహదేవన్(47) మరణించిన సందర్భంలో శశికళ పెరోల్ కోసం ఎంతగానో అభ్యర్థించినా సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.
‘చిన్నమ్మకు పెరోల్’ వచ్చిందన్న వార్తలు ఆమె అభిమానుల్లో ఉత్తేజం నింపగా, ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని పార్టీ నాయకత్వంలో మాత్రం అలజడి రేపాయి. ఇప్పటికే శశికళ సహా ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్‌లను పార్టీ పదవుల నుంచి తొలగించిన నేపథ్యంలో చిన్నమ్మ స్పందన ఎలా ఉంటుందోనని పళని వర్గీయుల్లో చర్చ మొదలైంది.
శశితో దినకరన్ భేటీ: బెంగళూరులోని పణప్పర అగ్రహారం జైలులో ఉన్న శశికళను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ కలిశారు. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపడం, అక్రమ ఆస్తుల కేసుల్లో గతవారం అరెస్టయిన దినకరన్.. శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. సోమవారం ఉదయం అగ్రహారం జైలులో శశితో భేటీ అనంతరం దినకరన్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళేనని, ఉప ప్రధాన కార్యదర్శి తానేనని దినకరన్ చెప్పారు. అక్క కొడుకుగా కాకుండా పార్టీ ఉపనాయకుడిగానే చిన్నమ్మతో భేటీ అయ్యానని వివరించారు.