
రొంబ ఉత్కంఠ
వీర విధేయుడి సింహనాదం ఒకవైపు.. నోరుమెదపని నెచ్చెలి శివతాండవం మరోవైపు.. తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది.
పన్నీర్, శశికళ పోరు ముమ్మరం
- పై చేయి ఎవరిదో తేలేది నేడే
- నేనేంటో సభలో నిరూపిస్తా: సెల్వం
- అమ్మ మరణంపై సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలన్న ఆపద్ధర్మ సీఎం
- ద్రోహులను నమ్మొద్దు: శశికళ
- మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నాకే
- నేడు గవర్నర్ రాష్ట్రానికి రాక
- క్యాంప్ రాజకీయాలు షురూ..
వీర విధేయుడి సింహనాదం ఒకవైపు.. నోరుమెదపని నెచ్చెలి శివతాండవం మరోవైపు.. తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది.
రోజంతా ఎత్తులు పై ఎత్తులతో పైచేయి సాధించేందుకు వైరి శిబిరాలు కత్తులు నూరుతూ కనిపించాయి. రాజకీయ పరిణామాలు క్షణానికో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేకెత్తించాయి. ఎన్నడూ గట్టిగా మాట్లాడని పన్నీర్ సెల్వం విలేకరుల సమావేశంలో హూంకరించారు. తానే సీఎంనని, అమ్మకు అనుంగు శిష్యుడిని కాబట్టి తనకే అన్ని అర్హతలు ఉన్నాయని కుండ బద్దలు కొట్టారు. ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, సభలో బలం నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. అసలు అమ్మ మరణం మిస్టరీపై సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసి శశికళ వర్గంలో కలకలం రేపారు.
మరోవైపు పొయెస్ గార్డెన్, అన్నాడీఎంకే కార్యాలయం వేదికగా శశికళ, ఆమె వర్గీయులు శివాలెత్తి పోయారు. 131 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని ప్రకటించారు. పార్టీని చీల్చడానికి పన్నీర్ కుట్ర పన్నుతున్నా డని, ద్రోహులను క్షమించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను శిబిరానికి తరలించారు. అవసరమైతే ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి వద్ద పరేడ్ నిర్వహిస్తామ న్నారు. గురువారం గవర్నర్ చెన్నై రానుండడంతో ఏ నిర్ణయం వెలువడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు దిష్టిబొమ్మల దహనాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతుందని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వర్గం ప్రకటించగా... తనదే అంతిమ విజయమవుతుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శాసనసభలో బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనని తమిళ రాజకీయ పార్టీలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఉత్కంఠ భరిత రాజకీయాలు...
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మంగళవారం రాత్రి మెరీనా బీచ్ వద్ద ఉన్న జయలలిత సమాధి వేదికగా శశికళ మీద తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. జయలలిత మృతికి శశికళే కారణం అనే అర్థం వచ్చే రీతిలో పన్నీర్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించాయి. సౌమ్యుడు, మృదు స్వభావి అయిన పన్నీర్ సెల్వం ఈ తరహాలో తిరుగుబాటు చేయడాన్ని ఊహించలేకపోయిన శశికళ బుధవారం రాత్రి నుంచే ఎమ్మెల్యేలను తన శిబిరానికి తరలించే రాజకీయం ప్రారంభించారు.
అన్నా డీఎంకేలో ఈ తరహా సంక్షోభం అనివార్యమని ధీమాగా ఉన్న డీఎంకే ఈ వ్యవహారంపై వేగంగా స్పందించింది. సీఎంను బెదిరించి రాజీనామా చేయించి, రాజ్యాంగ విరుద్ధంగా శశికళ సీఎం కావడాన్ని తాము అంగీకరించేది లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ప్రకటించారు. పన్నీర్‌కు తమ మద్దతు ఉంటుందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. శశికళను సీఎం కాకుండా అడ్డుకోవడానికి ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి వినతి పత్రం ఇచ్చి ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. శశికళ సీఎం కావడం ప్రధాని నరేంద్ర మోదీకి ఏ మాత్రం ఇష్టంలేని విషయాన్ని గుర్తించిన స్టాలిన్ తన చర్య ద్వారా పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మద్దతు ప్రకటించినట్‌లైంది.
మోదీ అండ.. పన్నీర్ ధీమా
అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు శశికళను ఆదివారం రాత్రి శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ నుంచి మద్దతు కూడగట్టాకే రెండు రోజుల తర్వాత పన్నీర్ తిరుగుబాటుజెండా ఎగురవేశారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వెంట ఎక్కువమంది ఎమ్మెల్యేలు వెళతారనే విషయం తెలిసినా మోదీ, స్టాలిన్ ధీమాతోనే ఆయన శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని సవాల్ విసిరి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బుధవారం నిర్వహించిన సమావేశానికి 131 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు శశికళ వర్గం ప్రకటించినా, ఎమ్మెల్యేలు అమ్మ ఆత్మ సాక్షిగా ఓటేస్తారని పన్నీర్ మరోసారి ధీమాగా చెప్పారు. అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు వారం లోపు తీర్పు చెబుతామని ప్రకటించడం, శశికళ తాత్కాలిక ప్రధాన క్యార్యదర్శి ఎన్నిక చెల్లదని ఎన్నికల సంఘం నిర్ణయానికి రావడం, జయ కుటుంబసభ్యుల నుంచి తగినంత మద్దతు లభించడం, ప్రధాన ప్రతిపక్షం సైతం అండగా నిలవడం పన్నీర్‌కు కొండంత ధైర్యం ఇచ్చినట్లు కనిపించింది. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు పోవడం తథ్యమనీ, ఆ తర్వాత ఎమ్మెల్యేలు అనివార్యంగా తనకే మద్దతు ఇస్తారని పన్నీర్ తన ఆంతరంగికుల వద్ద చెబుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఎమ్మెల్యేలతో శశికళ క్యాంపు రాజకీయం
పన్నీర్ తిరుగుబాటుతో కంగుతిన్న శశికళ మంగళవారం రాత్రి నుంచే ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయం ప్రారంభించారు. బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో శశికళ సమావేశం నిర్వహించిన తర్వాత తమకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం ప్రకటించింది. వీరిని బయటకు వదిలేస్తే పన్నీర్ సెల్వం తన్నుకుపోయే ప్రమాదం ఉందనే భయంతో పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో నగరంలోని రెండు స్టార్ హోటళ్లకు తరలించారు. తాము ఎక్కడికీ వెళ్లబోమని కొందరు ఎమ్మెల్యేలు చెప్పినా బలవంతంగా హాటల్‌కు తీసుకువెళ్లి తమ మద్దతుదారులను కాపలాగా ఉంచారు. ఎమ్మెల్యేల మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంక్షోభానికి తెరపడే దాకా క్యాంపులోనే ఉండాలనీ, మాట వింటే తాయిలాలు ఇస్తామనీ, కాదని వెళితే చిన్నమ్మ సీఎం అయ్యాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శశికళకు నిజంగా 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే వారిని హోటళ్లలో ఎందుకు నిర్భంధిస్తారని పన్నీర్ వర్గం సామాజిక మీడియాలో విస్తృత ప్రచారం చేస్తోంది. శశికళ నిర్భంధంలో ఉన్న ఎమ్మెల్యేలు సభకు వస్తే తనకే ఓటేస్తారని పన్నీర్ సెల్వం చేసిన ప్రకటన శశికళ వర్గానికి మరింత ఆందోళన కలిగిస్తోంది.
సీఎం పీఠంపై పన్నీర్, శశికళ ధీమా
పన్నీర్ సెల్వం, శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అనేది ఖచ్చితంగా తేలలేదు. అయితే ఇద్దరూ తామే సీఎం కాబోతున్నామని ధీమాగా చెబుతున్నారు. శాసనసభలో బలనిరూపణకు గవర్నర్ తనకు అవకాశం ఇస్తారని పన్నీర్ చెబుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడటానికి ముంబై వచ్చి కలుస్తానని బుధవారం ఉదయం ఆయన గవర్నర్ సమయం కూడా కోరారు. తన మద్దతుదారులతో తానే ముంబై వస్తానని శశికళ కూడా గవర్నర్ సమయం కోరారు. ఈ వివాదం నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్‌రావు ఇద్దరికీ సమయం కేటాయించకుండా గురువారం సాయంత్రం ఆయనే చెన్నై వస్తున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... అది రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనని తమిళనాడు ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.