
శశికళకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళకు మరోసారి ఎదురుదెబ్బ తగిలించింది. జైలు నుంచి బయటపడాలనుకున్న ఆమె ఆశలపై సర్వోన్నత న్యాయస్థానం నీళ్లు చల్లింది. తన విధించిన జైలు శిక్షను రద్దు చేయాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శిక్షను రద్దు చేయడానికి ఎటువంటి కారణం కనబడటం లేదని న్యాయస్థానం పేర్కొంది.
అక్రమ ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆమె కారాగారవాసం గడుపుతున్నారు. తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ మే నెలలో ఆమె రివ్యూ పిటిషన్ వేశారు. శశికళ ప్రభుత్వ పదవులు నిర్వహించలేదని, అక్రమాస్తుల కేసులో ఆమెకు శిక్ష విధించడం తగదని ఆమె తరపు న్యాయవాది చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. ఆమెను విడుదల చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. శశికళ, ఆమె ఇద్దరి బంధువులకు విధిస్తూ ఇచ్చిన తీర్పులో ఎటువంటి లోపాలు కనబడటం లేదని స్పష్టం చేసింది.
ప్రధాన నిందితురాలు జయలలిత చనిపోయినందున తనను విడుదల చేయాలన్న అభ్యర్థనను కోర్టు మన్నించలేదు. తనను జైలుకు పంపడానికి ముందు కూడా ఇదేవిధమైన వాదనను సుప్రీంకోర్టులో శశికళ వినిపించారు. అప్పుడు కూడా న్యాయస్థానం ఈ వాదనను తిరస్కరించింది. రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించడంతో శశికళ చివరి ప్రయత్నం కూడా అయిపోయింది. ఇక శిక్ష పూర్తయ్యే దాకా జైలు నుంచి ఆమె బయటకు వచ్చే అవకాశాలు లేవు.