
‘శశికళకు ఆ హక్కు లేదు’
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నటరాజన్ కు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ స్వాగతించారు. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం మంచి తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. అన్నాడీఎంకే సారథ్యం వహించే నాయకుడు శశికళ చేతిలో కీలుబొమ్మ కారాదని ఆమె ఆకాంక్షించారు. జయలలిత కోరుకున్న వ్యక్తే ముఖ్యమంత్రి కావాలన్నారు.
తమిళనాడు ప్రజలకు నాయకత్వం వహించే హక్కు శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు లేదని స్పష్టం చేశారు. జయలలిత తన జీవితంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదని, దేన్ని కాక్షించలేదని చెప్పారు. ప్రజాసేవకే అంకితమవ్వాలని ‘అమ్మ’ కోరుకుందని తెలిపారు.