
రహస్య ప్రాంతానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
చెన్నై: శరవేగంగా సమీకరణాలు మారుతుండడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ జాగ్రత్త పడుతున్నారు. తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెర తీశారు. ఇందుల్లో భాగంగా 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను శశికళ వర్గీయలు బస్సుల్లో రహస్య ప్రాంతానికి తరలించారు. వీరందరినీ ఓ హోటల్ కు తరలించినట్టు సమాచారం.
మరోవైపు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు శశికళ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని శశికళ వర్గీయులు కోరారు. రాష్ట్రపతి అంగీకరిస్తే 130 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ లో 130 మంది ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించాలని శశికళ భావిస్తున్నట్టు సమాచారం. అలాగే గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని అన్నాడీఎంకే నిర్ణయించింది.
శశికళపై తిరుగుబాటు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెంట ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.