జయ సమాధి వద్ద మీడియాతో మాట్లాడుతున్న జయలక్ష్మి
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవించి ఉన్నప్పుడే కాదు గతించిన తరువాత కూడా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. జయ కుమార్తెను అని చెప్పుకుని గతంలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు హడావిడి చేసి.. ఆ తరువాత మిన్నకుండి పోయారు. ఈ క్రమంలో తాజాగా మరో మహిళ తెరపైకి వచ్చారు. తగిన ఆధారాలతో జయ కుమార్తెను అని త్వరలో నిరూపించుకుంటానని చెన్నైలో శనివారం స్పష్టం చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: జీవితాంతం కుమారిగానే మెలిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఒక కుమార్తె ఉందని దశాబ్దాల తరబడి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని జయ ఏనాడు ఖండించలేదు. అలాగని సమర్ధించనూ లేదు. జయ మరణం తరువాత తమను వారసులుగా గుర్తించాలంటూ ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో బెంగళూరు, మైసూరు నుంచి వేర్వేరుగా ఇద్దరు యువతులు, ఓ యువకుడు వచ్చారు. కొన్నాళ్లు పోరాడారు. అయితే వారి వాదన పెద్దగా నిలవక పోవడంతో తెరమరుగై పోయారు.
నేనే జయ కుమార్తెను..:
ఇదిలా ఉండగా, తాజాగా మరో మహిళ తెరపైకి వచ్చింది. చిన్నపాటి మందీ మార్బలంతో శనివారం సాయంత్రం చెన్నై మెరీనాబీచ్‌లోని జయ సమాధి వద్దకు చేరుకుని ఆమె నివాళులర్పించారు. సమాధికి ప్రదక్షిణ చేసి కన్నీరు పెట్టుకున్నారు. ఆమె హావభావాలు, కట్టూబొట్టూ, బాడీ లాంగ్వేజ్ అంతా జయను పోలినట్లుగా ఉండడంతో పరిసరాల్లోని వారు ఆశ్చర్యంగా అనుసరించారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధుల వద్ద జయ కుమార్తెగా పరిచయం చేసుకున్నారు.. ‘‘మాది మైసూరు. చెన్నై పల్లవరంలో స్థిరపడ్డాను. చాలా ఏళ్ల క్రితమే నేను జయ కుమార్తెను అని తెలుసు. అయితే ఇష్టం లేక, కొన్ని సమస్యల వల్లనే ఇన్నేళ్లూ బాహ్య ప్రపంచంలోకి రాలేదు. అమ్మ కంటే ఆస్తి పెద్దది కాదు, అందుకే అప్పట్లో రాలేదు. అమ్మను కోల్పోయిన షాక్ నుంచి బయటకు వచ్చేందుకు ఇంత సమయం పట్టింది.
చదవండి: (Heavy Rains: మరో ఐదు రోజులు కుండ పోతే!)
చెన్నై పోయస్ గార్డెన్ ఇంటిలో మొదటిసారి అమ్మతో మాట్లాడాను. ఆ తరువాత అపోలో ఆసుపతిలో కలిశాను. అమ్మ పీఏ అపోలో ఆసుపత్రి వెనుకమార్గం గుండా లోనికి తీసుకెళ్లారు. అమ్మతో నేరుగా మాట్లాడాను. చెక్కిలిపై ఆమె ముద్దు పెట్టుకుంది. ఉద్వేగానికి లోనై ఇద్దరం కన్నీరు పెట్టుకోవడంతో బేబీని తీసుకెళ్లండని అక్కడి సిబ్బందికి చెప్పింది. దీప, దీపక్ నాతో మాట్లాడేందుకు యత్నించారు, అయితే ఇష్టం లేక దూరంగా మెలిగాను. ఇప్పటికే కొందరు జయ కుమార్తెలు అని వచ్చారు, అయితే అందరికీ ఆమె అమ్మ కాలేదు కదా.. వారు ఫేక్ అని రుజువైంది కదా.
జయ కుమార్తెను అని వైద్యపరంగా కూడా నిరూపణకు అన్ని ఆధారాలు ఉన్నందునే ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాను. మంచి రోజు చూసి మీడియా వద్ద బహిరంగ పరుస్తాను. మైసూరులో నన్ను పెంచిన వారు ఇటీవలే మరణించారు. నాకు ఇప్పటికీ చిన్నమ్మ శశికళ మాత్రమే అండగా ఉంది. చిన్నమ్మతో కూడా ఇంకా మాట్లాడలేదు. మూడు నాలుగు రోజుల్లో శశికళను కలుస్తాను. అపాయింట్‌మెంట్ కూడా ఆమె ఇచ్చారు. రాజకీయాల గురించి ఇప్పుడు ప్రశ్నలు వేయవద్దు, త్వరలో రాజకీయం గురించి అన్ని విషయాలు చెబుతాను. నా పేరు ప్రేమ, అమ్మ నన్ను జయలక్ష్మి అని ముద్దుగా పిలుచుకునేది’’ అని ఆమె వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment