
చిన్నమ్మకు ఎన్ని కష్టాలు..!
బెంగళూరు: జయలలిత బతికున్న రోజుల్లో ఆమె నెచ్చెలి శశికళ ఓ వెలుగు వెలిగారు. జయ నివాసం పోయెస్ గార్డెన్‌లో మహారాణిలా బతికారు. చిన్నమ్మకు పార్టీ నాయకులు, అధికారులు వంగివంగి దండాలు పెట్టేవారు. జయలలిత మరణించాక అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ.. తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారనుకున్న సమయంలో ఆమె జాతకం మారిపోయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడటంతో సీఎం పదవి చేజారింది. బెంగళూరు అగ్రహార జైలుకు ఆమె వెళ్లాక పార్టీలోనూ పరిస్థితులు మారిపోయాయి. చిన్నమ్మ తన నమ్మినబంటు పళనిస్వామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టినా పార్టీలో ప్రతికూలత తప్పలేదు. పార్టీ ఉపప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు దినకరన్ లంచం కేసులో అరెస్ట్ అయ్యారు. ఆమెను వ్యతిరేకించి మాజీ సీఎం పన్నీరు సెల్వంతో జత కట్టేందుకు పళని స్వామి సుముఖంగా ఉండగా, పార్టీలో ఆమెకు విధేయలుగా ఉన్నవారు దూరమయ్యారు. చిన్నమ్మతో సహా ఆమె బంధువులను పార్టీ నుంచి బహిష్కరించాలనే డిమాండ్లు వస్తున్నాయి. జైల్లో చిన్నమ్మ కష్టంగా కాలం గడుపుతున్నారు.
జైలులో చిన్నమ్మను చూసేందుకు వచ్చేవారే కరువయ్యారు. ఈ నెల 15 నుంచి ముగ్గురు మాత్రమే వచ్చారు. మార్చి, ఏప్రిల్ మొదట్లో ఎక్కువ సందర్శకులు వచ్చినా ఇటీవల వీరి సంఖ్య తగ్గింది. గత 14 రోజుల్లో ముగ్గురు మాత్రమే రాగా, వీరిలో ఒకరు శశికళ దగ్గరి బంధువైన డాక్టర్ ఉన్నారు. ఇక జైల్లో శశికళను సాధారణ ఖైదీగా పరిగణిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె వదిన ఇళవరసి ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా అనారోగ్య సమస్యల వల్ల ఇళవరసి ఎక్కువగా జైలు ఆస్పత్రిలో ఉండటంతో సెల్‌లో శశికళ ఒంటరిగా ఉంటున్నారు. చిన్నమ్మ ఎక్కువ సమయం టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నట్టు జైలు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవల అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న పరిణామాలు శశికళను కలవరానికి గురిచేస్తున్నాయని, జైలుకు మొదట్లో వచ్చినప్పటితో పోలిస్తే ఆమెలో ఆత్మవిశ్వాసం తగ్గిందని తెలిపారు. అంతేగాక అనారోగ్య సమస్యలు చిన్నమ్మను వేధిస్తున్నట్టు సమాచారం.