సాక్షి , చెన్నై: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే కూటముల్లో సీట్ల సర్దుబాట్లు ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మూడో కూటమి తలుపులు మూసుకుపోవడంతో ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’(ఏఎంఎంకే) నేతృత్వంలో నాలుగో కూటమికి చిన్నమ్మ శశికళ సిద్ధం అవుతున్నారు. తమిళనాట ఎన్నికలంటే అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే పోటీ అనే ఆనవాయితీకి మూడో కూటమి ఏర్పాటుతో గండి కొట్టాలని ప్రతిసారి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అవి విఫలం కావడం కూడా పరిపాటిగా మారింది. అయినా యథాప్రకారం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మూడో కూటమి పుట్టుకొచ్చింది.
డీఎంకే కూటమి నుంచి వైదొలగిన ‘ఇండియా జననాయక కట్చి’మూడో కూటమిని ఏర్పాటు చేసి అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన నటుడు శరత్‌కుమార్ అధ్యక్షునిగా ఉన్న ’సమత్తువ మక్కల్ కట్చి’ని చేర్చుకుంది. ఆ మరుసటి రోజునే ఐజేకే అధ్యక్షుడు రవి పచ్చముత్తు, శరత్‌కుమార్ ‘మక్కల్ నీది మయ్యం’అధ్యక్షులు కమల్‌హాసన్‌ను కలుసుకుని మూడో కూటమిలోకి ఆహ్వానించారు. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండమని ఆఫర్ కూడా ఇచ్చారు. ఇందుకు సమ్మతించిన కమల్..శశికళ, దినకరన్ సారథ్యం లోని ఏఎంఎంకేను చేర్చుకోకుంటేనే వస్తానని షరతు విధించారు. చదవండి: (తమిళనాడు: 21 సీట్లిస్తాం.. వాటితోనే సర్దుకోండి)
ఆర్థిక నేరాల కేసులో శిక్షను అనుభవించిన శశికళ వల్ల మూడో కూటమిపై అవినీతి మచ్చపడుతుందని కమల్ వాదించగా సమ్మతించారు. డీఎంకే కూటమిలో సర్దుబాటు కుదరక కాంగ్రెస్ సైతం మూడో కూటమివైపు రావచ్చని కమల్ అంచనా వేస్తున్నారు. అయితే, అలాంటి సూచనలు ఏవీ కనపడడం లేదు. మూడో కూటమిలో చేరే ముందు శరత్‌కుమార్ శశికళతో భేటీ కావడంతో కొత్త కూటమి వెనుక ఆమె ప్రోద్బలం ఉందని పరిశీలకులు అంటున్నారు. రెండు కూటముల్లోని అసంతృప్త వాదులు వలసలు ముగిసిన తరువాత మూడో కూటమిలోకి ప్రవేశించి పగ్గాలు చేపట్టాలని శశికళ, దినకరన్ ఆశించారు. అయితే శశికళ కంటే కమల్ వస్తేనే బలమని మూడో కూటమి తీర్మానించుకోవడంతో శశికళ నాలుగో కూటమి సన్నాహాలు మొదలుపెట్టారు. ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బుధవారం ఉదయం శశికళను కలిసి నాలుగో కూటమి ఏర్పాట్లను ముమ్మురం చేశారు. ఒత్తిళ్లు, బెదిరిం పులకు లోనై బయటకు వెళ్లగక్కలేక మదన పడుతున్న అన్నాడీఎంకే అగ్రనేతలు తమవైపు వస్తారని శశికళ ఎదురు చూస్తున్నారు.
అంతర్గత కీచులాటతో నష్టపోయి ప్రభుత్వాన్ని డీఎంకే చేతుల్లో పెట్టేకంటే శశికళతో సర్దుకుపోవడమే మేలని బీజేపీ ఇప్పటికే అన్నాడీఎంకే అధిష్టానంతో చెప్పడం, వారు విముఖత వ్యక్తం చేయడం జరిగిపోయింది. ఈ రకంగా బీజేపీ తమ పట్ల సాఫ్ట్‌కార్నర్‌తో ఉందని శశికళ నమ్ముతున్నారు. సీట్ల కేటాయింపు వ్యవహారంలో అన్నాడీఎంకేపై బీజేపీ అసంతృప్తితో ఉంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న టీటీవీ దినకరన్ చెన్నైలో అమిత్‌షాను రహస్యంగా కలిశారు. ఏఎంఎంకేకు 10–15 సీట్లు ఇస్తాం, అయితే కమలం చిహ్నంపై పోటీచేయాలని అమిత్‌షా షరతు విధించినట్లు తెలుస్తోంది. దీంతో నాలుగో కూటమిలో బీజేపీ చేరడం ఖాయమని దినకరన్ ధీమాతో ఉన్నారు. అయితే బీజేపీ చిహ్నంపై పోటీ చేసేందుకు మాత్రం దినకరన్ అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా బీజేపీతో చర్చలపై ముందుకెళ్లలేక వెనక్కిరాలేక సతమతం అవుతున్నారు.
అన్నాడీఎంకే, బీజేపీలకు ఆహ్వానం: దినకరన్
టీటీవీ దినకరన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏఎంఎంకే సారథ్యంలో నాలుగో కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఎంఎంకే–అన్నాడీఎంకే మధ్య రహస్య సయోధ్య వ్యూహంపై ప్రస్తుతానికి ఏమీ చెప్పకూడదని అన్నారు. డీఎంకే అధికారంలోకి రాకుండా అడ్డుకోవమే లక్ష్యంగా ఎన్నికలను ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే, బీజేపీలను సైతం తమ నాలుగో కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment