జొహన్నెస్‌బర్గ్: పదవీ కాలంలో అవినీతి ఆరోపణలపై కోర్టు జైలు శిక్ష విధించడంతో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సానుభూతి పల్లవి అందుకున్నారు. ఇప్పటివరకు విచారణకు హాజరు కానంటూ బీరాలు పలికిన జూమా తాజాగా కొత్తపాట ఆరంభించారు. ఈ వయసులో, కరోనా సమయంలో తాను జైలుకు పోవడమంటే అది మరణ శిక్ష విధించినట్లేనంటూ సానుభూతిపరుల మద్దతుకు యత్నించారు. అంతలోనే తాను జైలుకు భయపడనంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు 1980 కాలం నాటి నిర్భంధాన్ని గుర్తు తెస్తున్నాయంటూ విమర్శించారు.
మరోవైపు జుమా అరెస్టును అడ్డుకునేందుకు పలువురు మద్దతుదారులు ఆయన నివాసం చుట్టూ మానవ కవచంలా నిలుచున్నారు. అవినీతి కేసులో 15నెలల జైలు శిక్ష విధించిన కోర్టు ఆయనంతట ఆయనే పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తన ఇంటి బయట మద్దతుదారులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో 79ఏళ్ల వయసులో జైలుకు పోవడమంటే మరణశిక్ష విధించినట్లేనని, దక్షిణాఫ్రికాలో 1995లోనే మరణ శిక్ష రద్దయిందని చెప్పారు. ఇదే అభ్యర్ధన చేస్తూ ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానంలో తీర్పు పునఃసమీక్ష పిటీషన్ కూడా వేశారు.
శనివారం ఈ పిటీషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించి, తదుపరి వాయిదాను జూలై 12కు వేసింది. అప్పటివరకు జైలు శిక్ష అమలు వాయిదా పడనుంది. కరోనా కాలంలో ఇంతమంది మద్దతుదారులు మాస్కుల్లేకుండా గుమికూడినా వారికి జుమా ఎలాంటి సూచనలు చేయలేదు. నిజానికి కరోనా నిబంధనల కాలంలో ఇలాంటి సమావేశం చట్టవ్యతిరేకమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే తమ నాయకుడిని అరెస్టు చేస్తే హింస తప్పదనే సంకేతాలను జుమా మద్దతుదారులిస్తున్నారు. జుమా, ఆయన మద్దతుదారుల ప్రవర్తనను పలువురు తీవ్రంగా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment