
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద డ్రాగన్ దేశం చైనా రెచ్చిపోతోంది. డ్రాగన్ సైన్యం భారత భూభాగంలోకి క్రమంగా చొచ్చుకొస్తూ సరిహద్దును సైతం మార్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన డీజీపీల సమావేశంలో చైనా వ్యవహారంపై అధికారులు సమర్పించిన ఓ నివేదికలో పలు సంచలన అంశాలు బహిర్గతమయ్యాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో భారత్–చైనా సైనికుల నడుమ మరిన్ని ఘర్షణలు జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనాన్ని వెలువరించింది.
భారత్–చైనాల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలు, నిఘా సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ‘‘2013–14 తర్వాత రెండు మూడేళ్లకోసారి ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతల తీవ్రత పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సరిహద్దులో ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక బలగాలను పెంచుకుంటున్నాయి. చైనా చర్యల వల్ల తూర్పు లద్దాఖ్‌లో భారత్ ఇప్పటికే పలు కీలక గస్తీ పాయింట్లను కోల్పోయింది. చైనా దూకుడును అడ్డుకోవాలంటే సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలి. సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment