సమావేశంలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో ఈటల, కె.లక్ష్మణ్, బండి, మహేశ్వర్‌రెడ్డి తదితరులు
ఆరు గ్యారంటీల పేరుతో సీఎం రేవంత్ మోసం చేయాలని చూస్తున్నాడు
కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసినా, డబ్బు ఖర్చు పెట్టినా డబుల్ డిజిట్ సీట్లు బీజేపీకే..
రాష్ట్ర పదాధికారుల భేటీలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిచి రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నాడు. కానీ ఈ జన్మలో రాహుల్‌గాంధీ ప్రధాని కాడు’..అని కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా, డబ్బులు ఖర్చు పెట్టినా, డబుల్ డిజిట్ సీట్లు బీజేపీకే వస్తాయన్నారు.
రేవంత్‌రెడ్డి కొత్తగా సీఎం అయ్యారని విమర్శించకుండా విడిచిపెట్టాల్సిన అవసరం పార్టీ, నేతలకు లేదని చెప్పారు. మహిళలు స్వచ్ఛందంగా బీజేపీ కార్యక్రమాలకు వస్తున్నారు..మోదీ ప్రధాని కావాలని అంటున్నారన్నారు. ‘కేంద్ర పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలి. తెలంగాణలో బీజేపీ సానుకూల వాతావరణం ఉంది.అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. ఇంటింటికి వెళ్లి ఓటరును కలవాలి’ అని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మన్మోహన్‌సింగ్ పదేళ్ల పాలనతో మోదీ పాలనను సరిపోల్చి కాంగ్రెస్ చరిత్రనే అవినీతి అని ప్రజలకు వివరించాలని సూచించారు.
లోక్‌సభ అభ్యర్థులతో ముఖాముఖి
లోక్‌సభ ఎంపీ అభ్యర్థులతో కిషన్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు ముఖాముఖి మాట్లాడారు. సెగ్మెంట్ పరిధిలో పరిస్థితి ఎలా ఉంది. ప్రచార సరళి, ఓటర్ల మనోగతం, వివిధ పార్టీల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
12 నుంచి 15 సీట్లు గెలుస్తాం : డీకే.అరుణ
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ 12 నుంచి 15 స్థానాలు గెలుస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ‘ఎక్కడికెళ్లినా అందరి నోట ఒకటే మాట. మోదీకే మా ఓటు. గ్రామాల్లో ముసలివారు సైతం మోదీకే ఓటు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీకి ఓటు వేసుకున్నా ఈ ఎన్నికల్లో మోదీకే వేస్తామంటున్నారు.’ అని ఆమె చెప్పారు.
6న ప్రతి పోలింగ్ బూత్‌లో టిఫిన్ బైఠక్ : బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి
వచ్చే నెల 6న ప్రతి పోలింగ్‌బూత్‌లో టిఫిన్ బైఠక్‌లు నిర్వహించనున్నట్టు బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళతాం. కార్నర్ మీటింగ్‌లకు ప్రాధాన్యం. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యక్రమాలు చేపడతాం’ అని ప్రకటించారు.
బీజేపీలోకి చేరికలు...
అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్ నుంచి బీజేపీ రెబెల్‌గా పోటీచేసిన విష్ణువర్దన్‌రెడ్డి, ఆయన అనుచరులు, కోదాడ నియోజకవర్గానికి చెందిన ఓయూ జేఏసీ నేత అంజియాదవ్, కార్యకర్తలు, మహబూబ్‌నగర్ లోక్‌సభ సెగ్మెంట్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ కార్యాలయంలో జి.కిషన్‌రెడ్డి కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు డీకే.అరుణ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment