కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్
ఇక్కడ హామీల అమలుకు దిక్కు లేదు గానీ.. దేశవ్యాప్తంగా కూడానా?
రాహుల్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు..
ఇవన్నీ ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకునేందుకే
చైనాను పొగుడుతున్న రాహుల్‌కు బుద్ధి లేదని విమర్శ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా అబద్ధాలు చెబుతున్నారని.. కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లు, గ్యారంటీలకు దిక్కులేకుండా పోయిందని, వీటిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో బహిరంగ చర్చకు సిద్ధమ ని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు రాహుల్ సిద్ధమేనా అని సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోను తుక్కు గూడలో విడుదల చేశామని, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ రాహుల్ గాంధీ పేర్కొనడాన్ని కిషన్‌రెడ్డి తప్పుబట్టారు.
హామీల్ని నిలబెట్టుకున్నామంటున్న రాహుల్ గాంధీకి దమ్ము, ధైర్యముంటే హామీలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు .‘తెలంగాణ ప్రజల తరఫున మేం వస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ చర్చకు రావాలి’ అని డిమాండ్ చేశారు. ఉట్టికెగరనోడు.. ఆకాశానికి ఎగురుతానన్నట్లు రాహుల్ తీరు ఉందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో తెలియని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఉన్నారని విమర్శించారు. తుక్కుగూడలో కాంగ్రెస్ సభ ముగిశాక శనివారం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇక్కడ చేత కాలేదు కానీ దేశవ్యాప్తంగా చేస్తారా?
తెలంగాణలో హామీ ఇచ్చిన మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వడం చేత కాలేదు కానీ దేశవ్యాప్తంగా దానిని అమలుచేస్తామంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నిర్వహణ చేత కాక రాజీనామా చేసిన రాహుల్ గాంధీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
మీ ఇళ్లలో నోట్లు ముద్రించే యంత్రాలున్నాయా?
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఆ పార్టీ కార్యా లయాల్లో, రేవంత్ రెడ్డి ఇంట్లోనో, సోనియా గాంధీ ఇంట్లోనో నోట్లు ముద్రించే యంత్రాలు పెట్టుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. చైనా బ్రాండ్ వస్తువులు బాగుంటాయంటున్న రాహుల్‌గాంధీ అవి ఇక్కడకు వస్తాయని అంటున్నారా.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చైనాను పొగుడు తున్న ఆయనకు కొద్దిగా కూడా బుద్ధి లేదని మండిపడ్డారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు గాంధీ పరివార్ కి మోదీ పరివారానికి మధ్య జరిగే పోరాటమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఈవీఎంల ద్వారానే గెలిచిన రేవంత్ రెడ్డి వాటిపైనే ఆరోపణలు చేయడానికి సిగ్గుండాలన్నారు.
ఫిరాయింపులపై ఉన్న దృష్టి పాలనపై ఏదీ?
సీఎం రేవంత్‌రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న ధ్యాస పాలనపై కానీ, ఎన్నికల హామీల అమలుపై కానీ లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ 44వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం పార్టీ కార్య క్రమంలో పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో ఆట ఆడేది బీజేపీ మాత్రమేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment