అమరులైన సైనికులకు నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: సైనికుల బలిదానాలు వృ«థా కాబోవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్ శాంతికాముక దేశమే కానీ, రెచ్చగొడితే సరైన రీతిలో సమాధానమివ్వగలదని స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా సైనికుల పాశవిక దాడిలో అమరులైన భారతీయ జవాన్లకు ప్రధాని ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వారితో పాటు బుధవారం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అంతకుముందు చైనా ఘాతుకంపై స్పందిస్తూ.. దేశ సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోదని తేల్చి చెప్పారు.
‘భారత్ ప్రాథమికంగా శాంతిని కోరుకునే దేశం. పొరుగుదేశాలతో స్నేహ, సహకార సంబంధాల దిశగానే కృషి చేశాం. పొరుగు దేశాల అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంక్షించాం. మనమెవరినీ రెచ్చగొట్టం. అదే సమయంలో, ఎవరైనా రెచ్చగొడితే, సరైన రీతిలో సమాధానమిస్తాం. మన దేశ చరిత్రలో త్యాగంతో పాటు శౌర్యం, వీరత్వం కూడా సమపాళ్లలో కనిపిస్తాయి. దేశ సమగ్రత, సార్వభౌమత్వాల విషయంలో రాజీ లేని ధోరణి భారత్‌ది. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే క్రమంలో అవసరమైన ప్రతీసారి భారత్ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటూనే ఉంది’ అని మోదీ పేర్కొన్నారు.
రక్షణ మంత్రి, హోం మంత్రి నివాళులు
చైనా సరిహద్దుల్లో వీర మరణం చెందిన భారతీయ సైనికులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ఘనంగా నివాళులర్పించారు. జవాన్లు అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని రాజ్‌నాథ్ కొనియాడారు. దేశం వారి త్యాగాన్ని మరచిపోదన్నారు. సైనికుల ప్రాణ త్యాగంపై బాధను వ్యక్తపరిచేందుకు తన వద్ద మాటలు లేవని అమిత్ షా ట్వీట్ చేశారు. వారికి దేశం రుణపడి ఉంటుందన్నారు.
అంగుళం కూడా వదలం
చైనా సైనికుల దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని.. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లు వారని, పోరాటంలో శత్రువును అంతమొందిస్తూ వారు ప్రాణాలొదిలారని కొనియాడారు. ‘మన అమర జవాన్ల త్యాగాలు వృథా కావు. ఎలాంటి పరిస్థితుల్లోనయినా, దేశ ఆత్మగౌరవాన్ని నిలబెడతాం. ఒక అంగుళం భూభాగాన్ని కూడా వదలబోం’ అన్నారు. ‘సార్వభౌమత్వం మనకు సర్వోన్నతం. దాన్ని కాపాడుకోవడంలో మనల్నెవరూ ఆపలేరనే విషయంలో అణుమాత్రం కూడా సందేహం అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment