మళ్లీ సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష.. కారణమిదే! | Sonam Wangchuk Is On Hunger Strike | Sakshi
Sakshi News home page

Sonam Wangchuk: మళ్లీ సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష.. కారణమిదే!

Published Mon, Mar 11 2024 11:20 AM | Last Updated on Mon, Mar 11 2024 11:45 AM

Sonam Wangchuk is on Hunger Strike - Sakshi

ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దేశంలోని లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరవ షెడ్యూల్‌ను వెంటనే అమలు చేయాలని కోరుతూ లేహ్‌లో 21 రోజుల నిరాహార దీక్షకు దిగారు. మార్చి 7న ప్రారంభమైన ఈ నిరాహార దీక్ష 21 రోజుల పాటు కొనసాగనుంది.

సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు?
సోనమ్ వాంగ్‌చుక్  వృత్తిరీత్యా ఇంజనీర్, ఆవిష్కర్తగా,  వాతావరణ పరిరక్షణకు పాటుపడే వ్యక్తిగా పేరొందారు. లడఖ్‌లోని విద్యా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తూ ‘స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్‌’ను స్థాపించారు.  కృత్రిమ హిమానీనదాలను సృష్టించే మంచు స్థూప సాంకేతికతను రూపొందించారు. ఇందుకోసం ఆయన 2018లో రామన్ మెగసెసే అవార్డు, 2017లో గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్‌ అవార్డులను అందుకున్నారు.

లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ అమలు డిమాండ్‌తో వాంగ్‌చుక్ మరోసారి నిరాహారదీక్షకు దిగారు. ఇవే డిమాండ్లతో గత ఏడాది జనవరిలో ఐదు రోజుల పాటునిరాహార దీక్ష చేశారు. అది కూడా 18 వేల అడుగుల ఎత్తులో -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య నిరాహార దీక్షకు దిగారు. లడఖ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని వాంగ్‌చుక్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఆయన, ఈ అంశానికి ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. వాంగ్‌చుక్ తన దీక్షతో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించారు.

త్రీ ఈడియట్స్‌ సినిమాలో..
అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్‌లు నటించిన ‘త్రీ ఇడియట్స్‌’లో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర వాంగ్‌చుక్ క్యారెక్టర్‌ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. అప్పుడు వాంగ్‌చుక్ గురించి దేశంలోని అందరికీ తెలిసింది. అయితే  ఈ సినిమా తన బయోపిక్ కాదని, వినోదం కోసం తన జీవితం నుండి ప్రేరణ పొందారని పలు సందర్భాల్లో వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement