సాక్షి, చెన్నై: లడక్ గాల్వన్ లోయలో చైనా–భారత్ ఆర్మీ మధ్య జరిగిన దాడుల్లో రామనాథపురానికి చెందిన సైనిక వీరుడు పళని అమరుడయ్యాడు. ఈ సమాచారంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. వీరమరణం పొందిన పళనిని స్మరిస్తూ రామనాథపురంలో నివాళులర్పించే వాళ్లు ఎక్కువే. భారత ఆర్మీలో దక్షిణ తమిళనాడుకు చెందిన యువకులు మరీ ఎక్కువే. కొన్ని గ్రామాలకు చెందిన వాళ్లు పదుల సంఖ్యలో దేశ సేవకు అంకితమై ఉన్నారు. ఆదిశగా రామనాథపురం నుంచి ఆర్మీకి వెళ్లిన వారు మరెందరో. వీరిలో 22 ఏళ్ల క్రితం దేశ సేవకు తనను పళని అంకితం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆర్మీలో హవల్దారుగా విధుల్ని నిర్వర్తిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్న చైనా – భారత్ సరిహద్దుల్లోని లడక్ ప్రాంతంలోని గాల్వన్ లోయల్లో పళని విధుల్లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో మంగళవారం భారత ఆర్మీ వర్గాల నుంచి రామనాథపురానికి వచ్చిన ఓ సమాచారం పళని కుటుంబాన్నే కాదు, అతడి స్వగ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
బై బై..మళ్లీ చేస్తా..
రామనాథపురం జిల్లా తిరువాడనై సమీపంలోని కడుకలుగు గ్రామానికి చెందిన కాళిముత్తు కుమారుతు పళని. 22 ఏళ్ల క్రితం దేశసేవకు అంకితమైన పళనికి భార్య వానతీ దేవి, పదేళ్ల కుమార్తె, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో పళని ఫోన్లో మాట్లాడారు. తాను చైనా – భారత్ సరిహద్దుల్లోని లడక్ గాల్వన్ లోయల్లో విధుల్లో ఉన్నట్టు చెప్పారు. ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, మళ్లీ ఎప్పుడు చేస్తానో ఏమో అంటూ, మళ్లీ తాను చేసే వరకు ఫోన్‌చేయ వద్దు అని కుటుంబానికి సూచించాడు. భార్య, పిల్లలు, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడి బైబై..ఇక సెలవు మళ్లీ చేస్తాను లే అని ముగించి ఉన్నాడు. చదవండి: విషం చిమ్మిన చైనా..
మళ్లీ చేస్తాను లే...అన్న పళని ఇప్పుడు ప్రాణాలతో లేదన్న సమాచారం ఆ కుటుంబాన్ని జీర్ణించుకోలేకుండా చేసింది. మంగళవారం ఉదయం సరిహద్దుల్లో చైనా – భారత్ ఆర్మీ మధ్య జరిగిన దాడుల్లో పళని వీర మరణం పొందిన సమాచారం రామనాథపురం వాసుల్ని విషాదంలోకి నెట్టింది. భర్త మరణ సమాచారంతో వానతీ దేవి వేదన వర్ణణాతీతం, ఇక, పిల్లలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇక, తన అన్నయ్య ఆర్మీకి చేస్తున్న సేవను చూసి పళని తమ్ముడు కూడా ఆర్మీలో చేరి ఉండడం గమనార్హం. తన అన్న మరణ సమాచారంతో ఆర్మీ విధుల్లో ఉన్న ఆ సోదరుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. పళని అమరుడైన సమాచారం జిల్లా కలెక్టరేట్ ద్వారా ఆ కుటుంబానికి చేరగానే, ఒక్కసారి గా ఆ గ్రామం అంతా శోక సంద్రంలో మునగడం గమనార్హం.
రూ. 20 లక్షలు..
పళని కుటుంబానికి సీఎం పళనిస్వామి రూ. 20 లక్షలు సాయం ప్రకటించారు. సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో ముగ్గురు భారత ఆర్మీ వర్గాలు మరణించిన సమాచారం దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం పళనిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. ఈ దాడిలో రామనాథపురానికి చెందిన పళని అమరుడు కావడం మరింత వేదన కల్గించిందన్నారు. ఆ కుటుంబానికి తన సానుభూతి తెలియజేస్తూ, రూ. 20 లక్షలు సాయం ప్రకటించారు. అలాగే, ఆ కుటుంబంలో ఒకరికి విద్యార్హత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఆ గ్రామానికి చేరుకుని ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రామనాథపురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఇక, పళని మరణ సమాచారంతో డీఎంకే అ«ధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment