మాస్కోలో భారత్, రష్యా, చైనా విదేశాంగ మంత్రులు
మాస్కో: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే లక్ష్యంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. ప్యాంగాంగ్ సరస్సు కేంద్రంగా రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న ఈ మే నెల నుంచి రెండు దేశాల విదేశాంగ మంత్రులు ముఖాముఖీ భేటీ కావడం ఇదే ప్రథమం.
గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర స్థాయి ఘర్షణల సమయంలో జూన్ 17న ఇరువురు నేతలు ఫోన్‌లో చర్చలు జరిపారు. చైనా దురాక్రమణ చర్యలు కొనసాగిస్తుండటంతో పాటు భారీగా సైనిక దళాలను మోహరించడం, కొన్ని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడంతో.. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోకి భారత్ అదనపు బలగాలను, యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని భారీగా తరలించింది.
‘కాసేపట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమవనున్నారు. సరిహద్దు సమస్యను వారిద్దరు చర్చిస్తారు’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడిం చారు. ‘దౌత్య, మిలటరీ మార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలనే భారత్, చైనా భావిస్తున్నాయి’ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్, వాంగ్ మాస్కో వెళ్లారు.
ఆర్‌ఐసీ విదేశాంగ మంత్రుల భేటీ
ఎస్‌సీఓ సమావేశాల సందర్భంగా గురువారం మాస్కోలో రష్యా, భారత్, చైనా(ఆర్‌ఐసీ) విదేశాంగ మంత్రులు వరుసగా సెర్గీ లెవ్రోవ్, జైశంకర్, వాంగ్ సమావేశమయ్యారు. పరస్పర సహకారం, స్నేహం, విశ్వాసం స్ఫూర్తిగా త్రైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల విషయమై వారు చర్చించారు. భేటీ అనంతరం వారు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అంతర్జాతీయంగా అభివృద్ధిదాయక శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి ఈ మూడు దేశాల మధ్య త్రైపాక్షిక సహకారం ఆవశ్యకమని అందులో పేర్కొన్నారు.
వ్యూహాత్మక పర్వతాలపై భారత్ పాగా
ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో చైనా దళాలు ఉన్న ప్రదేశాలపై దృష్టి పెట్టేలా కీలకమైన పలు పర్వతాలపై భారత బలగాలు నియంత్రణ సాధించాయి. రెండు దేశాల ఆర్మీలకు చెందిన బ్రిగేడ్ కమాండర్లు, కమాండింగ్ అధికారులు వేర్వేరుగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment