china Foreign Minister Wang Yi
-
ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తొలగించే దిశగా భారత్, చైనా ముందడుగు వేశాయి. మాస్కోలో గురువారం జరిగిన రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఇందుకు సంబంధించి ఐదు అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేలా చర్యలు చేపట్టకపోవడం, వాస్తవాధీన రేఖ వెంట శాంతి, సంయమనం నెలకొనడం, రెండు దేశాల సరిహద్దు భద్రత దళాలు చర్చలు కొనసాగించడం, సైనిక బలగాల మధ్య దూరం పాటించడం అనే ఐదు అంశాల్లో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు మాస్కో వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా అక్కడ ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఇరువురు నేతల మధ్య ఈ విషయంలో దాదాపు రెండున్నర గంటల పాటు నిర్మాణాత్మకంగా, నిర్మొహమాటంగా చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఉభయ దేశాలకు ప్రయోజనకరం కాదని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. తూర్పు లద్దాఖ్‌లో ప్యాంగాంగ్ సరస్సు కేంద్రంగా భారత్, చైనాలు భారీగా బలగాలను, యుద్ధ సామగ్రిని మోహరించిన విషయం తెలిసిందే. విదేశాంగ మంత్రుల భేటీ సందర్భంగా కుదిరిన ఐదు అంశాల ఒప్పందం ప్రస్తుత సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దు దళాలు చర్చలు కొనసాగించాలని, బలగాల ఉపసంహరణ సాధ్యమైనంత త్వరగా జరగాలని, ఇరు దేశాల సైన్యం తగినంత దూరం పాటించాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు’ అని పేర్కొంటూ శుక్రవారం ఉదయం ఒక సంయుక్త ప్రకటనను భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది. అయితే, బలగాల ఉపసంహరణకు సంబంధించి ఎలాంటి కాల వ్యవధిని ఈ ఐదు అంశాల ఒప్పందంలో పేర్కొనలేదు. ‘సరిహద్దులకు సంబంధించిన అన్ని ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌ను రెండు దేశాలు గౌరవించాలని, సరిహద్దుల్లో శాంతి, సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు పెరిగే చర్యలు చేపట్టకూడదని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్రిక్తతలు చల్లారిన తరువాత,.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పూర్వక వాతావరణం నెలకొనేలా విశ్వాస కల్పన చర్యలు చేపట్టడాన్ని వేగవంతం చేయాలని కూడా నిర్ణయించాయని వెల్లడించారు. రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్æ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్æ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే ఉద్దేశంతో భారత్, చైనా విదేశాంగ మంత్రుల భేటీలో కుదిరిన ‘ఐదు అంశాల’ ఒప్పందంపై వీరంతా చర్చించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత దళాల సన్నద్ధతను సమగ్రంగా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని పేర్కొంటూ సంబంధిత వ్యూహాలను ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె వివరించారు. -
ఉద్రిక్తతల తొలగింపే లక్ష్యం
మాస్కో: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే లక్ష్యంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. ప్యాంగాంగ్ సరస్సు కేంద్రంగా రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న ఈ మే నెల నుంచి రెండు దేశాల విదేశాంగ మంత్రులు ముఖాముఖీ భేటీ కావడం ఇదే ప్రథమం. గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర స్థాయి ఘర్షణల సమయంలో జూన్ 17న ఇరువురు నేతలు ఫోన్లో చర్చలు జరిపారు. చైనా దురాక్రమణ చర్యలు కొనసాగిస్తుండటంతో పాటు భారీగా సైనిక దళాలను మోహరించడం, కొన్ని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడంతో.. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోకి భారత్ అదనపు బలగాలను, యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని భారీగా తరలించింది. ‘కాసేపట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమవనున్నారు. సరిహద్దు సమస్యను వారిద్దరు చర్చిస్తారు’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడిం చారు. ‘దౌత్య, మిలటరీ మార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలనే భారత్, చైనా భావిస్తున్నాయి’ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్, వాంగ్ మాస్కో వెళ్లారు. ఆర్ఐసీ విదేశాంగ మంత్రుల భేటీ ఎస్సీఓ సమావేశాల సందర్భంగా గురువారం మాస్కోలో రష్యా, భారత్, చైనా(ఆర్ఐసీ) విదేశాంగ మంత్రులు వరుసగా సెర్గీ లెవ్రోవ్, జైశంకర్, వాంగ్ సమావేశమయ్యారు. పరస్పర సహకారం, స్నేహం, విశ్వాసం స్ఫూర్తిగా త్రైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల విషయమై వారు చర్చించారు. భేటీ అనంతరం వారు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అంతర్జాతీయంగా అభివృద్ధిదాయక శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి ఈ మూడు దేశాల మధ్య త్రైపాక్షిక సహకారం ఆవశ్యకమని అందులో పేర్కొన్నారు. వ్యూహాత్మక పర్వతాలపై భారత్ పాగా ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో చైనా దళాలు ఉన్న ప్రదేశాలపై దృష్టి పెట్టేలా కీలకమైన పలు పర్వతాలపై భారత బలగాలు నియంత్రణ సాధించాయి. రెండు దేశాల ఆర్మీలకు చెందిన బ్రిగేడ్ కమాండర్లు, కమాండింగ్ అధికారులు వేర్వేరుగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. -
ద్వైపాక్షిక బంధంపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ/బీజింగ్: గాల్వన్ లోయ ఘర్షణ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత్ చైనాకు స్పష్టం చేసింది. ఈ ఘర్షణకు, సైనికుల మరణాలకు కారణం చైనా వ్యవహరించిన తీరేనని పేర్కొంది. క్షేత్రస్థాయిలో మార్పులు చేయాలన్న ముందస్తు ఆలోచనతో చైనా వ్యవహరించిందని, ఇది గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ఫోన్ చేసిన సందర్భంగా భారత్ పై విధంగా స్పందించింది. ఈ సందర్భంగా.. గాల్వన్ లోయలో చైనా సైనికుల ఘాతుకాన్ని జై శంకర్ తీవ్ర స్థాయిలో ఖండించారు. జూన్ 6న రెండు దేశాల కమాండింగ్ అధికారుల స్థాయి చర్చల్లో కుదిరిన ఒప్పందాన్ని ఇరుదేశాలు నిజాయితీగా, నిక్కచ్చిగా అమలు చేయాలని చైనాకు తేల్చిచెప్పారు. తమ చర్యలను సమీక్షించుకుని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతాయుత విధానంలో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు పేర్కొంది. మరోవైపు, ఇరుదేశాల విదేశాంగ మంత్రుల ఫోన్‌కాల్‌పై చైనా కూడా ఒక అధికారిక ప్రకటన వెలువరించింది. సాధ్యమైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయని ఆ ప్రకటనలో చైనా పేర్కొంది. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోవడం, వాటిలో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం సంభవించిన తరువాత తొలిసారి ఈ విదేశాంగ మంత్రుల చర్చలు చోటు చేసుకున్నాయి. సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా ఇరుదేశాలు సరిహద్దు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా వాంగ్ సూచించినట్లు చైనా పేర్కొంది. మరోవైపు, గాల్వన్ లోయలో ఘర్షణలకు భారతే కారణమని చైనా మరోసారి ఆరోపించింది. -
భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారొద్దు
బీజింగ్/ఇస్లామాబాద్: భారత్, చైనా మధ్య ఉండే భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు. ఓ దేశపు సమస్యలపై మరో దేశం ఎలా స్పందిస్తుందన్న విషయంపైనే భవిష్యత్తులో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని భారత్ ఏకపక్షంగా రద్దుచేయడాన్ని ఖండిస్తున్నామని చైనా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వుహాన్ సదస్సులో ఏర్పడిన సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ భారత్–చైనాల సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా బీజింగ్ చేరుకున్న జై శంకర్, చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ క్విషన్, విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ చైనా పర్యటన ముగిసిన వెంటనే జై శంకర్ చైనాను సందర్శించడం గమనార్హం. వారు వాస్తవాన్ని గుర్తించారు: బీజింగ్‌లో సోమవారం జరిగిన భారత్–చైనా అత్యున్నత కమిటీ(సాంస్కృతిక, ప్రజా సంబంధాలు) సమావేశంలో జై శంకర్ మాట్లాడుతూ..‘అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్–చైనాల ద్వైపాక్షిక సంబంధాలు చాలా విశిష్టమైనవి. ఇండియా–చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థికవ్యవస్థలు. రెండేళ్ల క్రితం భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ వాస్తవాన్ని గ్రహించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం కావాల్సిన అవసరముందని అస్తానా(కజకిస్తాన్)లో జరిగిన భేటీలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబం ధాలకు ప్రజామద్దతును పొందాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇది సాధ్యం కావాలంటే ఇండియా–చైనాల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకూడదు’ అని తెలిపారు. ఈ భేటీ వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టమవుతాయి వాంగ్ చెప్పారు. -
'చైనాలోకి చొరబడ్డామని భారత్ ఒప్పుకుంది'
న్యూఢిల్లీ: సిక్కింలోని సరిహద్దుల్లో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభనపై చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి తొలిసారి స్పందించారు. చైనా భూభాగంలోకి తమ సైన్యాలే చొరబడ్డాయని భారత్ ఒప్పుకొన్నదని ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి మనస్సాక్షికి కట్టుబడి భారత్ సైన్యాలు వెనుకకు తగ్గాలని, అదే పరిష్కారానికి మార్గమని వాంగ్ యి సూచించారు. సిక్కిం సెక్టార్‌లోని డొక్లామ్ ప్రాంతం తనదేనని చైనా వాదిస్తుండగా, అది భూటాన్‌కు చెందిన భూభాగమని భారత్, భూటాన్ వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఏకపక్షంగా రోడ్డునిర్మాణానికి తెగబడటంతో భారత సైన్యాలు కలుగజేసుకున్నాయి. దీంతో గత జూన్ నుంచి ఇక్కడ ఇరుదేశాల సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా థాయ్‌లాండ్‌లో ఉన్న చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి ఈ ప్రతిష్టంభనపై మీడియాతో మాట్లాడారు. 'భారత సీనియర్ అధికారులు సైతం చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించలేదని చెప్తున్నారు. అంటే దీని అర్థం తామే చైనీస్ భూభాగంలోకి ప్రవేశించామని అంగీకరించడమే' అని వాంగ్ యి చెప్పారు. సరిహద్దుల్లో భారత్-చైనా సైన్యాల ప్రతిష్టంభనపై స్పందించిన తొలి చైనా అత్యున్నత మంత్రి వాంగ్ యి కావడం గమనార్హం. ఈ విషయంపై చైనా దౌత్యవేత్తలు, మీడియా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. భారత్ సైన్యాలు స్వచ్ఛందంగా తప్పుకోవాలని యుద్ధకాంక్ష వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.