'చైనాలోకి చొరబడ్డామని భారత్ ఒప్పుకుంది'
న్యూఢిల్లీ: సిక్కింలోని సరిహద్దుల్లో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభనపై చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి తొలిసారి స్పందించారు. చైనా భూభాగంలోకి తమ సైన్యాలే చొరబడ్డాయని భారత్ ఒప్పుకొన్నదని ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి మనస్సాక్షికి కట్టుబడి భారత్ సైన్యాలు వెనుకకు తగ్గాలని, అదే పరిష్కారానికి మార్గమని వాంగ్ యి సూచించారు. సిక్కిం సెక్టార్‌లోని డొక్లామ్ ప్రాంతం తనదేనని చైనా వాదిస్తుండగా, అది భూటాన్‌కు చెందిన భూభాగమని భారత్, భూటాన్ వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఏకపక్షంగా రోడ్డునిర్మాణానికి తెగబడటంతో భారత సైన్యాలు కలుగజేసుకున్నాయి. దీంతో గత జూన్ నుంచి ఇక్కడ ఇరుదేశాల సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.
తాజాగా థాయ్‌లాండ్‌లో ఉన్న చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి ఈ ప్రతిష్టంభనపై మీడియాతో మాట్లాడారు. 'భారత సీనియర్ అధికారులు సైతం చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించలేదని చెప్తున్నారు. అంటే దీని అర్థం తామే చైనీస్ భూభాగంలోకి ప్రవేశించామని అంగీకరించడమే' అని వాంగ్ యి చెప్పారు. సరిహద్దుల్లో భారత్-చైనా సైన్యాల ప్రతిష్టంభనపై స్పందించిన తొలి చైనా అత్యున్నత మంత్రి వాంగ్ యి కావడం గమనార్హం. ఈ విషయంపై చైనా దౌత్యవేత్తలు, మీడియా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. భారత్ సైన్యాలు స్వచ్ఛందంగా తప్పుకోవాలని యుద్ధకాంక్ష వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.