లద్దాఖ్‌లో చాంగ్ లాలో జవాన్లను తీసుకెళుతున్న భారత సైనిక వాహనాలు
న్యూఢిల్లీ/బీజింగ్: గాల్వన్ లోయ ఘర్షణ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత్ చైనాకు స్పష్టం చేసింది. ఈ ఘర్షణకు, సైనికుల మరణాలకు కారణం చైనా వ్యవహరించిన తీరేనని పేర్కొంది. క్షేత్రస్థాయిలో మార్పులు చేయాలన్న ముందస్తు ఆలోచనతో చైనా వ్యవహరించిందని, ఇది గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ఫోన్ చేసిన సందర్భంగా భారత్ పై విధంగా స్పందించింది. ఈ సందర్భంగా.. గాల్వన్ లోయలో చైనా సైనికుల ఘాతుకాన్ని జై శంకర్ తీవ్ర స్థాయిలో ఖండించారు.
జూన్ 6న రెండు దేశాల కమాండింగ్ అధికారుల స్థాయి చర్చల్లో కుదిరిన ఒప్పందాన్ని ఇరుదేశాలు నిజాయితీగా, నిక్కచ్చిగా అమలు చేయాలని చైనాకు తేల్చిచెప్పారు. తమ చర్యలను సమీక్షించుకుని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతాయుత విధానంలో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు పేర్కొంది. మరోవైపు, ఇరుదేశాల విదేశాంగ మంత్రుల ఫోన్‌కాల్‌పై చైనా కూడా ఒక అధికారిక ప్రకటన వెలువరించింది.
సాధ్యమైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయని ఆ ప్రకటనలో చైనా పేర్కొంది. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోవడం, వాటిలో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం సంభవించిన తరువాత తొలిసారి ఈ విదేశాంగ మంత్రుల చర్చలు చోటు చేసుకున్నాయి. సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా ఇరుదేశాలు సరిహద్దు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా వాంగ్ సూచించినట్లు చైనా పేర్కొంది. మరోవైపు, గాల్వన్ లోయలో ఘర్షణలకు భారతే కారణమని చైనా మరోసారి ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment