shanghai cooperative organization
-
ఉద్రిక్తతల తొలగింపే లక్ష్యం
మాస్కో: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే లక్ష్యంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. ప్యాంగాంగ్ సరస్సు కేంద్రంగా రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న ఈ మే నెల నుంచి రెండు దేశాల విదేశాంగ మంత్రులు ముఖాముఖీ భేటీ కావడం ఇదే ప్రథమం. గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర స్థాయి ఘర్షణల సమయంలో జూన్ 17న ఇరువురు నేతలు ఫోన్లో చర్చలు జరిపారు. చైనా దురాక్రమణ చర్యలు కొనసాగిస్తుండటంతో పాటు భారీగా సైనిక దళాలను మోహరించడం, కొన్ని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడంతో.. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోకి భారత్ అదనపు బలగాలను, యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని భారీగా తరలించింది. ‘కాసేపట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమవనున్నారు. సరిహద్దు సమస్యను వారిద్దరు చర్చిస్తారు’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడిం చారు. ‘దౌత్య, మిలటరీ మార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలనే భారత్, చైనా భావిస్తున్నాయి’ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్, వాంగ్ మాస్కో వెళ్లారు. ఆర్ఐసీ విదేశాంగ మంత్రుల భేటీ ఎస్సీఓ సమావేశాల సందర్భంగా గురువారం మాస్కోలో రష్యా, భారత్, చైనా(ఆర్ఐసీ) విదేశాంగ మంత్రులు వరుసగా సెర్గీ లెవ్రోవ్, జైశంకర్, వాంగ్ సమావేశమయ్యారు. పరస్పర సహకారం, స్నేహం, విశ్వాసం స్ఫూర్తిగా త్రైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల విషయమై వారు చర్చించారు. భేటీ అనంతరం వారు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అంతర్జాతీయంగా అభివృద్ధిదాయక శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి ఈ మూడు దేశాల మధ్య త్రైపాక్షిక సహకారం ఆవశ్యకమని అందులో పేర్కొన్నారు. వ్యూహాత్మక పర్వతాలపై భారత్ పాగా ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో చైనా దళాలు ఉన్న ప్రదేశాలపై దృష్టి పెట్టేలా కీలకమైన పలు పర్వతాలపై భారత బలగాలు నియంత్రణ సాధించాయి. రెండు దేశాల ఆర్మీలకు చెందిన బ్రిగేడ్ కమాండర్లు, కమాండింగ్ అధికారులు వేర్వేరుగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. -
భారత్, పాక్ దగ్గరవుతాయిలా..
బీజింగ్: షాంఘై కో-ఆపరేటీవ్ ఆర్గనైజేషన్(ఎస్సీవో)లో చేరిక ద్వారా భారత్, పాకిస్తాన్ల మధ్య శుత్రుభావం తగ్గి మైత్రి వికసిస్తుందని చైనా అధికార పత్రిక పేర్కొంది. సుదీర్ఘంగా వైరి భావంతో ఉన్న ఈ రెండు దేశాల మధ్య ఎస్సీవో సభ్యత్వంతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పెరిగి పరస్పర సహకార భావం పెంపొందుతుందని తన తాజా వ్యాసంలో చెప్పింది. చైనా రాజధాని బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఎస్సీవో కూటమిలో ఈ రెండు దేశాల చేరికతో ఈ ప్రాంతంలో స్థిరత్వం, భద్రత పెరిగి ఆర్థిక ప్రగతితోపాటు ప్రాంతీయ ఆర్థిక సహకారం, సమగ్రతకు దారి తీస్తుందని పేర్కొంది. ఎస్సీవోలో చైనా, రష్యా, కిర్గిస్తాన్, కజక్‌స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వ్యవస్థాపక సభ్య దేశాలు కాగా, ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, భారత్, ఇరాన్, మంగోలియా, పాకిస్తాన్‌లు పరిశీలక దేశాలుగా ఉన్నాయి. 2015లో రష్యాలో జరిగిన సమావేశం భారత్, పాకిస్తాన్లను కూటమిలో చేర్చుకునేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని తీర్మానించారు. ఈ మేరకు ఈ ఏడాది జూన్‌లో కజక్‌స్తాన్ రాజధాని ఆస్తానాలో జరిగే ఎస్సీవో సమావేశంలో భారత్, పాకిస్తాన్ సభ్య దేశాలుగా మారనున్నాయి. ఎస్సీవో సభ్యులుగా చేరడానికి రెండు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేయవలసి వస్తుంది. అందులో ఎస్సీవో చట్టాలకు లోబడి ఉండటంతో పాటు సరిహద్దు తగాదాల పరిష్కారం, తీవ్రవాదాన్ని నిర్మూలించటం వంటివి కూడా ఉంటాయి. వీటి కారణంగా ఆయా దేశాలు వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సివుంటుంది. అంతేకాదు, సభ్య దేశాల మధ్య ఏవైనా వివాదాలు ఏర్పడితే మరో సభ్య దేశం మధ్యవర్తిగా వ్యవహరించి పరిస్ధితిని చక్కదిద్దుతుంది. రెండు దేశాల మధ్య తగాదాలను పరిష్కరించటంతో ఎస్సీవో కీలకంగా మారనుందని ఆ పత్రిక వివరించింది. సభ్య దేశాలుగా మారిన తర్వాత భారత్, పాకిస్తాన్ విరోధాన్ని మరచి పరస్పర అభివృద్ధి దిశగా పయనిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.