అప్రమత్తత అవసరం | Editorial On India and China LAC Row | Sakshi
Sakshi News home page

అప్రమత్తత అవసరం

Published Thu, Jul 9 2020 1:30 AM | Last Updated on Thu, Jul 9 2020 1:30 AM

Editorial On India and China LAC Row - Sakshi

రెండు నెలలపాటు ఉద్రిక్తతలతో అట్టుడికిన వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) చల్లబడిన సూచనలు కనబడుతున్నాయి. ఇరు దేశాల మధ్యా ఉన్నత స్థాయిలో జరిగిన చర్చల పర్యవసానంగా సోమ వారం భారత్‌–చైనా సైనికులు తాము మోహరించిన ప్రాంతాల నుంచి వెనక్కు రావడం ప్రారంభిం చారు. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్, చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీ మధ్య ఆదివారం సుదీర్ఘంగా ఈ చర్చలు జరిగాయి. పర్యవసానంగా అటు చైనా సైన్యం, ఇటు భారత్‌ సైన్యం ఒకటిన్నర కిలోమీటర్ల చొప్పున వెనక్కి వెళ్లాల్సివుంది. 

ఈ ప్రక్రియంతా పూర్తికావడానికి మరి కొన్ని నెలలు పడుతుందంటున్నారు. అంతా అనుకున్నట్టు పూర్తయితే ఎల్‌ఏసీ వద్ద మొత్తం మూడు కిలోమీటర్ల మేర తటస్థ ప్రాంతం(బఫర్‌జోన్‌) ఏర్పడుతుంది. అక్కడ ఇరు దేశాల సైనికులూ గస్తీ కూడా తిరగరు. అయితే ఈ ఏర్పాటంతా తాత్కాలికమే. ఈ ఉపసంహరణ ప్రక్రియ మూడు దశలుగా వుంటుంది. తొలి దశలో ఘర్షణలు నెలకొన్న ప్రాంతం నుంచి ఉపసంహరణ జరుగుతుంది. అది సక్రమంగా జరిగిందో లేదో రెండు వారాల తర్వాత సమీక్షిస్తారు. మిగిలిన రెండు దశల్లో ఎల్‌ఏసీ నుంచి రాకెట్లు, శతఘ్నులు, దీర్ఘశ్రేణి తుపాకులు వగైరాల తొలగింపు మొదలుకావాలి. కానీ ఆ ప్రక్రియలపై మరోసారి చర్చలు జరగాలి. గడువు తేదీలు నిర్ణయించాలి. 

సైన్యాల్ని ఉపసంహరించుకోవడం, ఉద్రిక్తతలు తగ్గడానికి పరస్పరం అంగీకారం కుదరడం హర్షించదగిందే. ఎందుకంటే కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకుపడిన పర్యవసానంగా మన శక్తి యుక్తులన్నీ దానిపై పెట్టవలసి వస్తున్నది. ముఖ్యంగా ప్రజారోగ్య రంగంలో మౌలిక సదుపాయా లను మెరుగుపరచడానికి విశేష కృషి చేయవలసివుంది. అన్ని రంగాలూ స్తంభించిపోవడంతో మన ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. ఈ గడ్డు పరిస్థితిలో రెండు దేశాల మధ్యా ఘర్షణలు తలెత్తితే వాటి పర్యవసానాలు తీవ్రంగా వుండక తప్పదు. కనుక సంయమనం పాటించడం, సామరస్యం కోసం చిత్తశుద్ధిగా ప్రయత్నించడం మంచిదే.  వివాదం ఎక్కడ తలెత్తిందో, ఎందుకు తలెత్తిందో ఇప్పుడు అందరికీ తెలుసు. గల్వాన్‌ లోయ వద్ద తమ ప్రాంతం ఎంత మేర వున్నదన్న అంశంపై 1960లో అప్పటి చైనా ప్రధాని ఝౌ ఎన్‌ లై ఒక అంగీకారానికి వచ్చిన అంశాన్ని విస్మరించి, ఆ లోయ మొత్తం తనదేనంటూ రెండు నెలలుగా చైనా వితండవాదం చేస్తోంది. 

ప్యాంగాంగ్‌ సో ప్రాంతంలో కూడా దాని వాదన అలాగే వుంది. 60 ఏళ్లక్రితం తమ నాయకుడే ఒప్పుకున్న ప్రాంతంలో కొత్త వివాదం సృష్టించడానికి చైనా ఎందుకు ప్రయత్నించిందన్నది కీలకమైన ప్రశ్న. కాకలు తీరిన నిపుణులు సైతం ఇందుకు జవాబు చెప్పలేకపోతున్నారు. ఆక్సాయ్‌ చిన్‌లో వ్యూహాత్మకంగా తన స్థితిని మెరుగుపరుచు కోవడానికి, చైనా–పాకిస్తాన్‌ కారిడార్‌కు అనువుగా వుండేందుకు అది ఈ పని చేసివుండొచ్చు. సరి హద్దుల్లో రహదార్లు, ఇతర మౌలిక సదుపాయాలు నిర్మిస్తున్న మన దేశానికి ఆటంకాలు కల్పించడం కూడా దాని ఉద్దేశం కావొచ్చు. మనం అమెరికాకు సన్నిహితమవు తుండటాన్ని జీర్ణించుకోలేక ఈ వివాదం తెరమీదకు తెచ్చివుండొచ్చు. మన ప్రభుత్వం జమ్మూ– కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంవల్ల లదాఖ్‌ ప్రాంతంలో తన ఉనికికి ముప్పు కలుగుతుందన్న అనుమానం వచ్చివుండొచ్చు. మొదట్లో వివాదం గురించి, చైనా సైన్యాలు ఎల్‌ఏసీ వద్ద మన ప్రాంతంలోకి చొరబడిన వైనం గురించి విపక్షాలు ఆరోపణలు చేసినా కేంద్రం మాట్లాడలేదు. 

అదే సమయంలో సైన్యం స్థాయిలో, దౌత్యపరంగా ఆ దేశంతో సంప్రదింపులు చేస్తూనే వుంది. ఆ విషయంలో ఒప్పందం కూడా కుదిరిందని, రెండు సైన్యాలు ఇప్పుడున్న ప్రాంతాల నుంచి వెనక్కు తగ్గాలన్న నిర్ణయం జరిగిందని వార్తలు వెలువడినప్పుడు అందరూ సంతోషించారు. కానీ గత నెల 15న హఠాత్తుగా చైనా సైన్యం మన జవాన్లపై దాడులకు తెగబడింది. తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌తో సహా 20మంది జవాన్ల ఉసురుతీసింది. ఎల్‌ఏసీ వద్ద చైనా సైనికులు నిర్మిస్తున్న శిబిరాలకు మన జవాన్లు అభ్యంతరం చెప్పడంతో ఈ దాడి జరిగిందని విదేశాంగ మంత్రి జైశంకర్‌ ప్రకటించారు. కానీ ఎలాంటి చొరబాట్లు జరగలేదని మరో నాలుగు రోజులకు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడంతో అందరిలో అయోమయం ఏర్పడింది. ఈ విషయంలో వివరణనివ్వాలని విపక్షాలు కోరుతున్న దశలోనే నరేంద్ర మోదీ ఈనెల 3న లదాఖ్‌ ప్రాంతంలో ఆకస్మిక పర్యటన జరిపి సైన్యం, వైమానిక దళం, ఇండో టిబెటిన్‌ సరిహద్దు పోలీస్‌(ఐటీబీపీ) దళాలనుద్దేశించి ప్రసంగించారు. విస్తరణవాదానికి ఓటమి ఖాయమని హెచ్చరించారు. చైనాకు ఇందులోని అంతరార్థం తెలిసివచ్చిందనే చెప్పాలి. కనుకనే చర్చలకు సిద్ధపడింది. వెనక్కు తగ్గడానికి అంగీకరించింది. 

కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడి అమెరికా విలవిల్లాడుతున్న దశలోనే చైనా అన్నిచోట్లా ఏకకాలంలో దూకుడు ప్రదర్శిస్తోంది. 23 ఏళ్లక్రితం హాంకాంగ్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు 2047 వరకూ అక్కడ పాత విధానాలే కొనసాగిస్తామని ఇచ్చిన హామీకి విరుద్ధంగా జాతీయ భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది. స్వేచ్ఛా స్వాతంత్య్రాలను వదులుకోబోమన్న హాంకాంగ్‌ ఉద్యమకారుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తన ఆధిపత్యమే కొనసాగా లంటోంది. మనపై నేపాల్‌ నిప్పులుగక్కడం వెనక కూడా దాని హస్తముంది. అక్కడ కేపీ శర్మ ఓలి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి చైనా తెరవెనక యత్నాలు చేస్తోంది. ఈ దశలో రెండు దేశాల మధ్యా ఎల్‌ఏసీ విషయంలో కుదిరిన అవగాహనను చైనా ఏమేరకు పాటిస్తున్నదో జాగ్రత్తగా గమనించడం, అనుకున్నవిధంగా లేకపోతే నిలదీయడం తప్పనిసరి. రెండు దేశాల సంబంధాలూ తిరిగి సాధారణ స్థితికి చేరాలంటే తన జగడాలమారి నైజాన్ని మార్చుకోక తప్పదని చైనా గ్రహించేలా చేయడం అవసరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement