China Constructing Worlds Largest Dam Three Gorges In LAC, Latest Reports Disturbing India - Sakshi
Sakshi News home page

China Three Gorges Dam: ‘సూపర్‌’ డ్యామ్‌ నిర్మాణంలో వెనక్కి తగ్గని చైనా? భారత్‌ను కలవరపెడుతున్న తాజా నివేదికలు!

Published Tue, Jul 18 2023 12:04 PM | Last Updated on Tue, Jul 18 2023 12:43 PM

chinas constructing of worlds largest dam in lac - Sakshi

టిబెట్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు (ఎల్‌ఎసి) సమీపంలో గల యార్లంగ్-త్సాంగ్‌పో నది (భారతదేశంలో దీనిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు) దిగువ ప్రాంతాలపై ‘సూపర్’ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా తన ప్రణాళికలను కొనసాగిస్తున్నదంటూ మరోమారు నివేదికలు వెలువడ్డాయి. 

భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా..
ప్రముఖ భౌగోళికరాజకీయ నిపుణుడు బ్రహ్మ చెల్లానీ నిక్కీ ఇటీవల..చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను రహస్యంగా నిర్మించడం సాధ్యం కాదని అన్నారు. కాగా చైనా రూపకల్పనలోని ఈ మెగా ప్రాజెక్ట్ 60 గిగావాట్ల సామర్థ్యం కలిగి భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా ఉంది. కాగా చైనా చేపడుతున్న ఈ ఆనకట్ట నిర్మాణ కార్యకలాపాల నివేదికలు మీడియాలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఈ ప్రాజెక్టుల స్థాయిని, భౌగోళిక పరిధిని చైనా ఎప్పుడూ వెల్లడించనందున అవి రహస్యంగానే కొనసాగుతున్నట్లు సమాచారం.

ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నదిపై..
బ్రహ్మపుత్ర నది కైలాష్ పర్వతం సమీపంలోని అంగ్సీ హిమానీనదంపై ఉద్భవించింది. 3,969-కిలోమీటర్ల పరిధి కలిగివుంది. దీని ఉపనది యార్లంగ్-త్సాంగ్పో వైవిధ్యమైన వాతావరణ, జలసంబంధమైన మండలాలను కలిగి ఉన్న ఒక ప్రధాన నదీ వ్యవస్థగా అలరారుతోంది. ఇది టిబెట్ అటానమస్ రీజియన్ (టీఏఆర్‌) నుంచి విభిన్న ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. యార్లంగ్ జాంగ్బో బ్రహ్మపుత్రగా భారతదేశంలోకి ప్రవహిస్తుంది. చివరకు బంగ్లాదేశ్‌లో డెల్టాను ఏర్పరుస్తుంది. తూర్పు దిశలో అనేక ఉపనదులను తనలో కలుపుకున్న తరువాత నది ఈశాన్యం వైపుకు మారుతుంది. హిమాలయాల తూర్పు చివర పర్వత ప్రాంతాల మధ్య పెద్ద ఇరుకైన మార్గం గుండా వెళ్లి తిరిగి చైనాను దాటుతుంది. భారత వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)కు ఇరువైపులా 5,000 మీటర్ల పరిధిలో విస్తరించి భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు లోతైన గార్జ్ (యార్లంగ్ త్సాంగ్పో గ్రాండ్ కాన్యన్) ఏర్పడుతుంది. నీటి విడుదల పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నది (సెకనుకు 19,825 క్యూబిక్ అడుగులు).
ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం.. గత రికార్డులు బద్దలు కొడుతూ..

‘ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం’
యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర వద్ద నది భారతదేశంలోకి ప్రవేశించే ముందు ఉన్న ప్రదేశంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని చైనా యోచిస్తోందని సమాచారం. నవంబర్ 2020లో ఆనకట్ట గురించిన నివేదికలు వెలువడినప్పుడు చైనీస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్.. ‘చైనా యార్లంగ్-త్సాంగ్పో నదిపై ఒక జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇది ఆసియాలోని ప్రధాన జలాల్లో ఒకటి. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ గుండా కూడా వెళుతుంది’ అని పేర్కొంది. కాగా పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ఛైర్మన్.. ‘చరిత్రలో దీనికి సమానమైనది లేదు. ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం. ఈ ఆనకట్ట 300 బిలియన్ల ఆదాయాన్ని అందించగలదని’ ప్రకటించారు. బీజింగ్ రూపొందించిన స్వచ్ఛమైన శక్తి లక్ష్యాలను చేరుకోవడంలో ఇది సహాయపడుతుందన్నారు. ఈ విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించిన రిపోర్టులు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. 

నీటి దోపిడీలో నిమగ్నమైన చైనా
చైనా తమ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరతను నివారించేందుకు ఈ నదిని ఉత్తరం వైపు మళ్లించే అవకాశం కూడా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితంగా భారతదేశానికి పలు చిక్కులు తలెత్తనున్నాయి. పర్యావరణ సమస్యలు తలెత్తడంతోపాటు బ్రహ్మపుత్ర నీటి ప్రవాహం తగ్గుతుందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. చైనా పలు ప్రధాన నదుల నుండి జలవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 డ్యామ్‌ల ప్రణాళికలను కలిగి ఉందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ తెలిపారు. టిబెటన్ పీఠభూమి నుండి ప్రవహించే అన్ని ప్రధాన నదులపై బహుళ డ్యామ్‌లను నిర్మింపజేస్తూ నీటి దోపిడీలో చైనా నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా యార్లంగ్-త్సాంగ్పో నదిపై పలు ప్రాంతాల్లో చైనా చిన్న డ్యామ్‌లను నిర్మించడం ప్రారంభించింది. ఇప్పుడు అతిపెద్ద ఆనకట్టలను నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 


అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తూ..
ఈ ఏడాది జనవరిలో జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్‌ పలు ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి, టిబెట్‌లోని మబ్జా జాంగ్‌బో (త్సాంగ్‌పో) నదిపై భారత్‌-నేపాలీ-చైనీస్ సరిహద్దు ట్రైజంక్షన్‌కు ఉత్తరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో డ్యామ్‌ నిర్మిస్తున్నట్లు ధృవీకరించారు. ఇది ఆనకట్ట నిర్మాణ కార్యకలాపానికి సంబంధం లేనప్పటికీ, ఇది హిమాలయ సరిహద్దులోని పలు విభాగాలలో కొనసాగుతున్న అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తున్నదన్నారు. యూఎన్‌ కన్వెన్షన్ ఆన్ నాన్-నేవిగేషనల్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్‌కోర్స్ ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ నదిలో జోక్యానికి వీటో అవకాశం కల్పించలేదు. 

చైనా ధోరణిపై భారత్‌ అప్రమత్తం
2002లో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం చైనా.. యార్లంగ్-త్సాంగ్‌పో/బ్రహ్మపుత్ర జలసంబంధ సమాచారాన్ని మే, అక్టోబర్ మధ్య భారత్‌తో పంచుకోవాలి. తద్వారా వర్షాకాలంలో భారీ ప్రవాహం తలెత్తినప్పుడు భారతదేశం అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే 2017 డోక్లామ్ సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత చైనా నది నీటి ప్రవాహ స్థాయిలను భారత్‌తో కమ్యూనికేట్ చేయడాన్ని అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ నేపధ్యంలో చైనా ధోరణి విషయంలో భారత్‌ అప్రమత్తమైంది. ప్రస్తుతం యార్లంగ్-త్సాంగ్పో-బ్రహ్మపుత్ర మార్గంలో చైనా చేపడుతున్న ఆనకట్ట నిర్మాణం పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను  మరింతగా పెంచే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. 
ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement