
నాగార్జున సాగర్.. ఒక అరుదైన ముచ్చట
ఇంత పెద్ద రాతి ఆనకట్ట నిర్మాణంలో యంత్రాలకంటే మనుషులే అమితంగా సేవలు అందించారు. పెద్దపెద్ద బండరాళ్లను, ఇనుప సామాన్లను కావిడ్లు వేసుకొని తమ భుజాలపై అంత ఎత్తుకు ఎక్కారు. ఒక చేత్తో కర్ర పొడుచుకుంటూ మరో చేత్తో భుజాలపై త్రాసులాగా తగిలించిన కావిడ్లపై పెద్ద పెద్ద బండరాళ్ల వేసుకొని ఆన కట్ట నిర్మాణానికి అందించారు. పదుల అంతస్తుల్లో నిర్మించిన పరంజీలు ఎక్కి మరీ ఈ సాహసం చేశారు.

మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే చిన్నచిన్న పిల్లలు కూడా ఈ ఆనకట్ట నిర్మాణంలో భాగస్వాములయ్యారు. తమ నెత్తిన సిమెంటు ఇసుకను, బండరాళ్లను కాళ్లకు చెప్పులు కూడా ధరించకుండా మిక్కిలి సంతోషంతో అందించారు. ఆనాటి పరిస్థితుల ప్రకారం తమ పొట్ట నింపుకునేందుకు అంతపెద్ద కష్టం చేసి ఉంటారేమోకానీ, వాస్తవానికి తాము చేస్తోంది ఒక చరిత్రోపకారం అనే విషయం ఆ అమాయక చిన్నారులకు తెలియకపోయి ఉండొచ్చు. ఆ వయసులోనే అంతపెద్ద బరువులు మోసిన వారితో పోలిస్తే నేటి చిన్నారుల బలం బలాదురూ అవుతుందేమో..!