న్యూఢిల్లీ: చైనా మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. సరిహద్దు సమస్యలపై భారత్‌తో చర్చలు జరుపుతూనే దొంగ దెబ్బ తీయాలని కుయుక్తులు పన్నింది. గత వారంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో యాంగ్‌త్సే సరిహద్దుల వెంబడి దాదాపుగా 200 మంది చైనా బలగాలు భారత్ భూభాగంలోకి రావడానికి ప్రయత్నించాయి. అయితే, భారత్ వారిని సమర్థవంతంగా అడ్డుకొని వెనక్కి పంపినట్టు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల బలగాల మధ్య కాసేపు ఘర్షణ నెలకొంది. ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి కూడా దిగారు. ‘‘ఇరు సైన్యాలు పరస్పరం భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు. కొన్ని గంటల సేపు ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం కొనసాగింది. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లిపోయాయి’’అని ఆ వర్గాలు తెలిపాయి.
రోజూ నిర్వహించే పెట్రోలింగ్‌లో భాగంగానే చైనా సైనికులు మన భూభాగంలోకి రావడానికి ప్రయత్నించడాన్ని సైనికులు గుర్తించారు. ఈ సందర్భంగా కొందరు చైనా సైనికుల్ని భారత సైనికులు కొన్ని గంటలసేపు నిర్బంధించి ఉంచారని కూడా వార్తలు వచ్చాయి. స్థానిక కమాండర్ల స్థాయిలో చర్చలు ఒక కొలిక్కి రావడంతో చైనా సైనికుల్ని భారత్ విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జూ లిజియాన్‌ను ప్రశ్నించగా అలాంటి విషయమేదీ తనకు తెలియదని బదులిచ్చారు. తూర్పు లద్దాఖ్ వివాదంపై రెండు దేశాల అత్యున్నత స్థాయి మిలటరీ చర్చలు మరో విడత జరగడానికి కొద్ది రోజుల ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల డ్రాగన్ దేశం సరిహద్దుల వెంబడి సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు దిగుతోంది.
ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో బారాహోతి సెక్టార్‌లో కూడా 100 మంది చైనా జవాన్లు భారత్ భూభాగంలోకి 5 కిలోమీటర్ల మేర ప్రవేశించి వంతెనను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది మే 5వతేదీన లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వెంబడి జరిగిన హింసాత్మక ఘటనతో రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఆ తర్వాత పలు దఫాలుగా రెండు దేశాల మధ్య మిలటరీ అధికారులు, దౌత్యప్రతినిధుల, విదేశాంగ మంత్రులు మధ్య చర్చలు జరిగాయి. ఫిబ్రవరిలో పాంగాంగ్ సరస్సు పరిసరాల నుంచి ఇరు దేశాలు బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. ప్రస్తుతం ఇరుపక్షాలకు చెందిన 50 వేల నుంచి 60 వేల బలగాలు సరిహద్దుల వెంబడి మోహరించి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment