
పారిస్/న్యూఢిల్లీ : భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్ దళాలు మోహరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చుమీరాయి. చైనాతో ముప్పు ముంచుకొస్తున్న క్రమంలో ఈ సంక్లిష్ట సమయంలో భారత్‌కు ఫ్రాన్స్ బాసటగా నిలిచింది. తమ సాయుధ బలగాలను తరలించడంతో పాటు భారత్‌కు ఎలాంటి సాయం అవసరమైనా ముందుంటామని పేర్కొంది. గల్వాన్ లోయలో జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించడం పట్ల ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ రక్షణ మంత్రి రాజ్‌నాథ సింగ్‌కు రాసిన లేఖలో సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సంక్లిష్ట సమయంలో ఫ్రాన్స్ సాయుధ దళాల తరపున తాను భారత్‌కు స్నేహపూర్వకంగా బాసటగా నిలుస్తానని లేఖలో పేర్కొన్నారు. భారత్ దక్షిణాసియా ప్రాంతంలో తమ వ్యూహాత్మక భాగస్వామని ఫ్రాన్స్ రక్షణ మంత్రి స్పష్టం చేశారు. భారత్‌లో రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. మరోవైపు జులై చివరికి ఫ్రాన్స్ నుంచి తొలిదశ రఫేల్ జెట్స్ భారత్‌కు చేరుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment