న్యూఢిల్లీ: గత మూడు వారాలుగా పొరుగు దేశం చైనాతో సరిహద్దు వివాదంపై పెరుగుతున్న ఉద్రిక్తతలు, కశ్మీర్‌లో వరుస హింసాత్మక అల్లర్లు, భూటాన్‌తో మైత్రి వంటి అంశాలపై కేంద్రం అన్ని పార్టీలతో కలసి శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.
వచ్చే సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా విపక్షాలు ఈ అంశాలు లేవనెత్తే అవకాశాలు ఉన్నందున కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అంశాలపై వివరణనిచ్చింది. ఈ అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ తరఫున గులాం నబీ అజాద్, మల్లికార్జున్ ఖర్గే, సీపీఎం తరఫున సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ తరఫున ములాయంసింగ్ యాదవ్, ఏల్జేపీ నుంచి రామ్ విలాస్ పాశ్వాన్, ఎన్సీపీ నుంచి తారిఖ్ అన్వర్, శరద్ యాదవ్, జేడీయూ నుంచి కేసీ త్యాగి, టీఎంసీ నుంచి దెరెక్ ఓ బ్రీన్‌లు హాజరయ్యారు.