
న్యూఢిల్లీ/సల్చార్/గువాహటి: అస్సాం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ చట్టం చేస్తే రాష్ట్రానికి చెందిన భూమిని సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. సరిహద్దుల్లోని రక్షిత అటవీ ప్రాంతాన్ని ఆక్రమణల నుంచి, విధ్వంసం నుంచి రక్షించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని లైలాపూర్ వద్ద సోమవారం జరిగిన కాల్పుల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు, ఒక పౌరుడు మృతి చెందగా మరో 60 మంది గాయపడిన విషయం తెలిసిందే.
సరిహద్దుల్లో రిజర్వు ఫారెస్టులో రోడ్ల నిర్మాణం, పోడు వ్యవసాయం కోసం అడవుల నరికివేతను కొనసాగనీయమన్నారు. అటవీ ప్రాంతంలో నివాసాలు లేవు. ఒక వేళ ఉన్నాయని మిజోరం ఆధారాలు చూపితే, వాటిని వెంటనే తొలగిస్తాం’ అని స్పష్టం చేశారు. పార్లమెంట్ చట్టం చేస్తే అస్సాంకు చెందిన ప్రాంతాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు ఒక్క అంగుళం భూమిని కూడా ఆక్రమణకు గురికానివ్వం’ అని ఆయన అన్నారు.
నేడు హోం శాఖ కార్యదర్శి సమావేశం
అస్సాం, మిజోరం సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా చర్చలు జరపనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఒక రాజీ ఫార్ములా కుదిరే చాన్సుంది. ఘటనకు నిరసనగా సరిహద్దుల్లోని అస్సాంలోని చచార్ జిల్లా ప్రజలు మిజోరం వైపు వాహనాలను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు. హింసాత్మక ఘటనలకు హోం మంత్రి అమిత్ షా వైఫల్యమే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment