
సాక్షి, న్యూఢిల్లీ : లడఖ్ ఘర్షణలకు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్రంగా మండిపడ్డారు. చైనాతో ఘర్షణలో మరణించిన 20 మంది వీరజవాన్లకు న్యాయం చేయాలని, వారికి ఏ మాత్రం తక్కువ చేసినా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్టేనని మన్మోహన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మన భద్రతా దళాల స్ధైర్యాన్ని పలుమార్లు నిర్వీర్యం చేసిన పార్టీకి మన్మోహన్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారని నడ్డా ఎద్దేవా చేశారు. చైనాకు బెంబేలెత్తి 43,000 కిలోమీటర్ల భూభాగాన్ని బీజింగ్‌కు గతంలో అప్పగించారని దుయ్యబట్టారు.
యూపీఏ హయాంలో చైనాతో పోరాడాకుండానే మన భూభాగంపై రాజీపడ్డారని నడ్డా ట్వీట్ చేశారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో వందలాది కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఆరోపించారు. 2010 నుంచి 2013 మధ్య మన్మోహన్ హయాంలో చైనా 600 సార్లు భారత్ భూభాగంలోకి చొరబాట్లు సాగించిందని నడ్డా అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏ అంశంలో అయినా తన విజ్ఞానాన్ని పంచుకోవచ్చని కానీ ప్రధాని కార్యాలయం బాధ్యతల్లో మాత్రం కాదని చురకలంటించారు. పీఎంఏ ప్రతిష్టను యూపీఏ మసకబార్చిందని విమర్శించారు. డాక్టర్ సింగ్..కాంగ్రెస్ పార్టీలు పదేపదే మన సేనలను అవమానించడం మానుకోవాలని హితవుపలికారు.
Comments
Please login to add a commentAdd a comment