తొందరపడొద్దు.. తలవంచొద్దు: సీఎం కేసీఆర్‌ | CM KCR Says For Short And Long Term Strategies Of Counter To China | Sakshi
Sakshi News home page

తొందరపడొద్దు.. తలవంచొద్దు: సీఎం కేసీఆర్‌

Published Sat, Jun 20 2020 12:57 AM | Last Updated on Sat, Jun 20 2020 11:28 AM

CM KCR Says For Short And Long Term Strategies Of Counter To China  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌–చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సమయంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానికి సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజ కీయం (రాజనీతి) కాదని, యుద్ధనీతి (రణనీతి) కావాలని పేర్కొ న్నారు. దేశంలో పాలన సుస్థిరంగా ఉండడంతోపాటు గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలు దువ్వుతోందని అభిప్రాయపడ్డారు.

శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అఖిలపక్ష భేటీలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీతో కలసి అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి  

చైనాతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వ హించిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి హోదాలో సీఎం కేసీఆర్‌ తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘చైనా, పాకిస్తాన్‌ లకు తమ దేశాల్లో అంతర్గత సమస్యలున్నప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటు. ఇప్పుడు చైనాలో అంతర్గత సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేసియా, ఫిలిప్పీన్స్, జపాన్‌ తదితర దేశాలతో కూడా చైనా ఘర్షణలకు దిగుతోంది. చైనా వైఖరి ప్రపంచవ్యాప్తంగా బాగా బద్నాం అయింది’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

అది తొందరపాటు చర్య అవుతుంది...
‘చైనా నుంచి వస్తువుల దిగుమతులు ఆపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది తొందరపాటు చర్య అవుతుంది. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వస్తువులు మన దేశంలోనే తయారు కావాలి. ప్రజలకు సరసమైన ధరల్లో వస్తువులు దొరకాలి. ముందుగా మనం ఈ విషయాలపై దృష్టి పెట్టాలి’అని కేసీఆర్‌ సూచించారు. రక్షణ వ్యవహారాల్లో మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. బ్రిటన్‌ ప్రతిపాదించిన డి–10 గ్రూపులో కలవాలని, ఓరాన్‌ అలయెన్సులో చేరాలని, హువాయ్‌ కంపెనీ ఎత్తుగడను తిప్పికొట్టాలని అభిప్రాయపడ్డారు. ‘భారతదేశంతో చైనా మొదటి నుంచి ఘర్షణ వైఖరి అవలంభిస్తోంది. గాల్వన్‌ లోయ వంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి.

ఇది మొదటిది కాదు.. చివరిదీ కాదు. 1957లో సరిహద్దు వివాదం లేవనెత్తింది. 1962లో ఏకంగా భారత్‌–చైనా మధ్య పూర్తిస్థాయి యుద్ధమే జరిగింది. ఇక ఇటీవల చైనా మనదేశంతో ఘర్షణాత్మక వైఖరి అవలంభించడానికి ప్రత్యేక కారణాలున్నాయి. కాశ్మీర్‌ విషయంలో కొత్త చట్టాలు తెచ్చాం. అక్కడి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. మనది శాంతికాముక దేశం. అదే సమయంలో సహనానికి హద్దు ఉంటుంది. ఎవరైనా మన మీదకి వస్తే తీవ్రంగా ప్రతిఘటించాలి. దేశ రక్షణ, ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు. ఈ పరిస్థితుల్లో రాజకీయం అవసరం లేదు. రణనీతి కావాలి. దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయమిది. గతంలో కూడా ఇతర దేశాలతో ఘర్షణలు, యుద్ధాలు జరిగినప్పుడు ఇలాగే నిలబడిన సందర్భాలున్నాయి’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

భారతదేశ పురోగతి చైనాకు నచ్చట్లేదు..
‘కరోనా వైరస్‌కు చైనాయే కారణమనే అపఖ్యాతి వచ్చింది. ఆ దేశం నుంచి చాలా బహుళ జాతి సంస్థలు బయటకు వస్తున్నాయి. అవి భారతదేశంవైపు చూస్తున్నాయి. పెట్టుబడులకు భారతదేశం అత్యుత్తమైనదని ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు. ప్రపంచబ్యాంకు రిపోర్టు ప్రకారం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భారత్‌ 142వ స్థానం నుంచి 63వ స్థానానికి ఎదిగింది. భారతదేశంలో ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ పాలసీలు బాగా అమలవుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. 2014 నుంచి 2017 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 36 బిలియన్‌ డాలర్ల నుంచి 61 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇంకా పెరగడానికి అవకాశాలున్నాయి. చైనా నుంచి తీసుకొచ్చి తెలంగాణలో తమ కంపెనీలు పెట్టడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. ఇది చైనాకు నచ్చడంలేదు’అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement