
సరిహద్దు ఘర్షణకు చైనా సైనికుల దూకుడే కారణమని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు
సాక్షి, న్యూఢిల్లీ : లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా సైనికులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం ఘర్షణకు దారితీసిందని ఫలితంగా 20 మంది భారత సైనికులు మరణించారని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీకి వివరించారు. జయశంకర్ బుధవారం వాంగ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ లడఖ్‌లో చోటుచేసుకున్న అసాధారణ ఘటనతో ఇరు దేశాల దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని జైశంకర్ హెచ్చరించారు. ఈ ఘటన ఇరు దేశాల దౌత్య ఒప్పందాలపై పెనుప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పరిస్థితిని చైనా పునఃసమీక్షించుకుని వాస్తవాధీన రేఖను గౌరవించాలని అన్నారు. ఏకపక్ష చర్యలకు పాల్పడరాదని చైనాకు జయశంకర్ తేల్చిచెప్పారు.
ఇక ఈ భేటీలో జూన్ 6న సైనికాధికారుల సమావేశంలో కుదిరిన అవగాహన మేరకు ఇరు దేశాల సేనల ఉపసంహరణపై అంగీకారం కుదిరింది. ఉద్రిక్తతలను తగ్గించి సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా వ్యవహరించాలని నిర్ణయించారు.ఇక లడఖ్‌లోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు నేలకొరిగిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ వీర జవాన్ల త్యాగం వృధా కాదని అన్నారు. భారత్ శాంతికాముక దేశమే అయినా తమ సార్వభౌమత్వానికి సవాల్ ఎదురైతే దీటుగా స్పందిస్తుందని స్పష్టం చేశారు.