సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనాకు చెందిన టిక్‌టాక్ సహా 59 యాప్‌లను భారత్ నిషేధించిన క్రమంలో చైనా వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మేయర్ భారత ఉద్యోగులకు బుధవారం లేఖ రాశారు. ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న భారత ఉద్యోగులకు బాసటగా నిలిచారు. ఇంటర్‌నెట్ ప్రజాస్వామీకరణకు కట్టుబడి టిక్‌టాక్‌ను తాము నడిపిస్తామని, ఈ ప్రక్రియలో తాము విజయవంతం అయినట్టు నమ్ముతున్నామని పేర్కొన్నారు.
ఈ దిశగా తమ లక్ష్యానికి అంకితభావంతో కట్టుబడి ఉన్నామని, సంస్థ భాగస్వాముల ఇబ్బందులను తొలగించే దిశగా కసరత్తు చేస్తున్నామని ఉద్యోగులకు రాసిన లేఖలో కెవిన్ స్పష్టం చేశారు. భారత చట్టాలకు అనుగుణంగా టిక్‌టాక్ డేటా ప్రైవసీ, భద్రతా ప్రమాణాలను పాటించడం కొనసాగిస్తోందని, యూజర్ల గోప్యత, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కంపెనీ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
భారత ఉద్యోగులకు సందేశం అనే పేరుతో ఆయన పోస్ట్ సాగింది. 2018 నుంచి భారత్‌లో తమ ప్రయాణం 20 కోట్ల యూజర్లను చేరుకుని వారి సృజనాత్మకత, ఉత్సాహం, వారి అనుభూతులను మిగతా ప్రపంచంతో పంచుకునేలా సాగిందని చెప్పారు. తమ ఉద్యోగులే తమ బలమని, వారి బాగోగులే తమ తొలి ప్రాధాన్యతని అన్నారు. 2000 మంది సిబ్బందికి వారు గర్వపడే అనుభూతులు, అవకాశాలను అందించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న భారత ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment