భారత్‌పై చైనా కొత్త పల్లవి!
బీజింగ్: అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి సర్వశక్తులొడ్డి మోకాలడ్డిన చైనా.. తాజాగా మన దేశంతో సంబంధాలపై కొత్త పల్లవి అందుకుంది. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంతోపాటు కొత్తగా తెరపైకి వస్తున్న అంశాలు పెద్ద సవాలుగా మారుతున్నాయని ఆ దేశం సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
‘పొరుగుదేశాలైన భారత్-చైనా సంబంధాల అభివృద్ధికి చరిత్రాత్మకమైన అంశమైన సరిహద్దు వివాదంతోపాటు కొత్తగా తెరపైకి వస్తున్న అంశాలు అడ్డుగా ఉన్నాయి. ఈ అంశాలను ఎలా ఎదుర్కోవాలని అనేది ఇరుదేశాలకు పెద్ద సవాలుగా మారింది’ అని చైనా విదేశాంగ సహాయమంత్రి లీ హుయిలై చెప్పారు. పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడిన లీ కొత్తగా తెరపైకి వస్తున్న అంశాలు ఏమిటన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తాజాగా చైనాలో పర్యటించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సరిహద్దు వివాదం, ఇతర వివాదాలు భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై కనీస ప్రభావాన్ని మాత్రమే చూపే అవకాశముందని పేర్కొనగా.. చైనా మాత్రం ఈ కొత్త రాగాన్ని తెరపైకి తెచ్చింది.